చిరంజీవి ఐడీతో.. ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ తో ఏపీ యూరియాపై దుష్ప్రచారం
దేశమంతా ఇప్పుడు రైతులది ఒకటే డిమాండ్... ! మాకు యూరియా కావాలని... ఒకేసారి వినియోగం పెరగడం, ఉత్పత్తి, దిగుమతి తగినంతగా లేకపోవడంతో కొరత ఏర్పడింది.
By: bunnyanil761@gmail.com | 9 Sept 2025 4:57 PM ISTదేశమంతా ఇప్పుడు రైతులది ఒకటే డిమాండ్... ! మాకు యూరియా కావాలని... ఒకేసారి వినియోగం పెరగడం, ఉత్పత్తి, దిగుమతి తగినంతగా లేకపోవడంతో కొరత ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి రైతులు రోడ్డెక్కి మరీ నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల తెల్లవారుజామునే పడిగాపులు కాస్తున్నారు. ఇదంతా చివరకు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆగ్రహంగా మారుతోంది. అవేమో కేంద్రంలోని మోదీ సర్కారు పైన నెపం వేస్తున్నాయి. ఇదే అదనుగా ఏపీలో ఓ సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుల గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
ఇదే అదనుగా దుష్ప్రచారం...
ఎప్పుడైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయో..అప్పుడే వదంతులు రాజ్యమేలుతుంటాయి. వీటికి సోషల్ మీడియా తోడైతే ఇక చెప్పాల్సి పని ఉండదు. ఏపీలో ఇలాగే కొందరు వ్యక్తులు యూరియా సరఫరాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇలాంటి వాటిని నమ్మొద్దని సూచించింది.
ఆ ఖాతా ఎవరిదో..?
మెగాస్టార్ చిరంజీవి పాత ఫొటోతో, ఆయన పేరు మీద ఉన్న బోగస్ ఖాతాపై.. యూరియా కొరత మీద దుష్ప్రచారం చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. కేంద్రం నుంచి అదనపు యూరియా వస్తుండగా.. అది అట్నుంచి అటే జపాన్ కు వెళ్తోందని ట్వీట్ పెట్టినట్లు తెలిపింది. చిరంజీవి పేరిట ఉన్న ఖాతాకు ఎట్ కరణమ్ఎన్టీఆర్ అని ట్యాగ్ లైన్ ఉండడం గమనార్హం.
ఆ ఫొటో బ్రెజిల్ ది...
ఇక ఏపీ ప్రభుత్వం ఖండించిన ట్వీట్ లో ఉన్న ఫొటో బ్రెజిల్ దిగా పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. రైతులు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఆయన రైతులను హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న వీడియో పైనా ప్రభుత్వం స్పందించింది. ఇలాంటివాటిపై చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.
