Begin typing your search above and press return to search.

'వైశ్యుల' సెంట్రిక్‌గా ఏపీలో అడుగులు!

ఈ నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కారు వైశ్యుల‌కు ప్రాధాన్యం పెంచింది. ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి హామీలు ఇవ్వ‌క‌పోయినా.. గ‌త కొన్నాళ్లుగా వైశ్యుల మ‌న‌సెరిగి ముందుకు సాగుతోంది.

By:  Garuda Media   |   17 March 2026 11:36 AM IST
వైశ్యుల సెంట్రిక్‌గా ఏపీలో అడుగులు!
X

ఏపీలో 5-8 శాతం ఉన్న వైశ్య సామాజిక వ‌ర్గం డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌డంలో కూట‌మి స‌ర్కారు దూకుడుగా ఉంది. వాస్త‌వానికి అగ్ర‌వ‌ర్ణ‌మే అయిన‌ప్ప‌టికీ.. వైశ్యులకు కూడా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం వైశ్యుల‌కు అనేక హామీలు ఇచ్చినా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పెద్ద‌గా వాటిని నెర‌వేర్చలేదు. ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను మంత్రిని చేశామ‌న్న ప్ర‌క‌ట‌న‌కే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిమితం అయ్యారు. ఇంత‌కుమించి ఎలాంటి హామీల‌ను నెరవేర్చ‌లేద‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది.

ఈ నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కారు వైశ్యుల‌కు ప్రాధాన్యం పెంచింది. ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి హామీలు ఇవ్వ‌క‌పోయినా.. గ‌త కొన్నాళ్లుగా వైశ్యుల మ‌న‌సెరిగి ముందుకు సాగుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌న్న ఆ సామాజిక వ‌ర్గం డిమాండ్‌ను ఆగ‌మేఘాల‌పై అమ‌లు చేసింది. కేవ‌లం ఆరు మాసాల కాలంలోనే అమ‌రావ‌తిలోని కోర్ ఏరియాలో ఉన్న శాఖ‌మూరులో 58 అడుగుల అమ‌ర‌జీవి విగ్ర‌హాన్నిఏర్పాటు చేశారు.

దీనికి ముందు.. వైశ్యులు ప‌ర‌మ‌ప‌విత్రంగా త‌మ సామాజిక‌వ‌ర్గం ఇల‌వేల్పుగా కొలుచుకునే వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆత్మా ర్పణ దినాన్ని.. రాష్ట్ర‌పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇది నిజానికి 30 ఏళ్ల‌నాటిడిమాండ్‌.. గ‌త ఏడాది దీనిని ప్ర‌భుత్వం సాకారం చేసింది. అంతేకాదు.. క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పుట్టిన ప్రాంతం పెనుగొండను 'వాసవీ పెనుగొండ'గా మార్చాల‌న్న మ‌రో డిమాండ్‌నుకూడా ప్ర‌భుత్వం నెర‌వేర్చింది. దీనికి సంబంధించి జీవోను కూడా ప్ర‌భుత్వం జారీ చేసింది. గడచిన ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకునేందుకు భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు.

జీఎస్టీ దాడుల‌ను త‌గ్గించారు. అదేవిధంగా జీఎస్టీ మిన‌హాయింపుల‌ను నేరుగా అందించేలా చేస్తున్నారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఇంటింటికి నీళ్లిచ్చే 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమానికి 'అమరజీవి జలధార' పేరు పెట్టారు. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల మంజూరులోనూ ఆర్య‌వైశ్యుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా.. ఆర్య‌వైశ్య సామాజిక వ‌ర్గాల‌కు మేలు చేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలు ఆ సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకును కూట‌మికి అనుకూలంగా మార్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.