రెండు ఎమ్మెల్సీ పదవులు టీడీపీకే.. వర్ల రామయ్య పేరు ఖరారు!
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ నేతలతో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Political Desk | 17 Aug 2026 5:44 PM ISTగవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ నేతలతో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలు ఉండగా, సర్దుబాటు కింద ప్రతిసారి పదవులను పంచుకుంటున్నారు. అయితే ఈ సారి పంపకాలు లేకుండా ఖాళీ అయిన రెండింటిని టీడీపీ తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన అంగన్ వాడీ కార్యకర్తల సంఘం నాయకురాలు దళవాయి రమాదేవి పేర్లను సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు టీడీపీ నేతలు కావడంతో ఈ దఫా జనసేన, బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ చాన్స్ లేనట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు సిఫార్సు చేసినట్లు జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ఈ పదవుల కోసం కూటమిలోని చాలా మంది నేతలు ప్రయత్నించగా, రాజకీయ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతో ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ఎస్సీ, మరొకరు బీసీ కావడం గమనార్హం. వర్ల రామయ్య దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్నారు. పోలీసు అధికారిగా రిటైర్ అయిన తర్వాత ఆయన 2009లో తిరుపతి పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తూ వస్తున్నారు.
గతంలో ఒకసారి శాసనమండలిలో బలం లేకపోయినప్పటికీ పార్టీ ఆదేశాలతో పోటీచేసి ఓడిపోయారు. చట్టసభ సభ్యుడిగా అడుగు పెట్టాలని చాలా కాలంగా కలలు కంటున్న వర్ల రామయ్య ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లు చెబుతున్నారు. పలుమార్లు రాజ్యసభ, శాసనమండలి సభ్యుడిగా ఎంపికయ్యే అవకాశాలు వచ్చి త్రుటిలో తప్పిపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా వర్ల రామయ్యను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని డిసైడ్ అయిన సీఎం చంద్రబాబు రెండో ఆలోచన లేకుండా ఆయన పేరు ఖరారు చేశారని అంటున్నారు. ఇక రెండో స్థానానికి బీసీ మహిళ దళవాయి రమాదేవిని ఎంపిక చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేకపోయినప్పటికీ బలహీన వర్గాలకు చెందిన మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆమెను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుందని అంటున్నారు. వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేసినట్లు జరుగుతున్న ప్రచారం ఆశావహుల్లో గుబులు రేపుతోందని చెబుతున్నారు. వర్ల రామయ్య అభ్యర్థిత్వంపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రాజకీయాల్లో కొత్త అయిన దళవాయి రమాదేవి పేరును పరిశీలించడమే నేతలను కలవరపాటుకు గురిచేస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా సీఎం చంద్రబాబు రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేసే విషయంలో ఆశావహులకు ఝలక్ ఇచ్చారని చెబుతున్నారు.
