ఏపీకి రెండు గవర్నర్ సీట్లు.. నిజమేనా.. ?
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తున్న వ్యవహారంపై వార్తలు మరింత ఊపందుకున్నాయి.
By: Garuda Media | 29 Jun 2026 7:37 PM ISTకేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తున్న వ్యవహారంపై వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కొందరు మంత్రులను గవర్నర్లుగా పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదేసమయంలో దేశవ్యాప్తంగా 6-8 రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పదవీ కాలం పూర్తి చేసుకున్నవారిని పక్కన పెట్టనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ కాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించనున్నారు.
అలాగే.. తమిళనాడు గవర్నర్‌గా ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర అర్లేకర్ స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇక, ఇతర రాష్ట్రాల్లోనూ మార్పులు ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు గవర్నర్ స్థానాలను ఏపీలోని మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జనసేనకు సహకరిస్తున్నాయి. ఈ మిత్రత్వాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కాగా వ్యవహరించాలని బీజేపీ నిర్ణయించుకున్న దరిమిలా.. ప్రస్తుతం ఉన్న మిత్రపక్షాలను మరింత అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్తరాదిలో బీజేపీ హవా తగ్గుముఖం పడుతోందన్న వాదన నేపథ్యంలో దక్షిణాది మిత్రపక్షాలను చేజార్చుకోకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో డిమాండ్‌గా ఉన్న గవర్నర్ సీట్ల విషయంలో ఈ సారి ఏపీకి కొంత వెసులుబాటు లభించనుందని అంటున్నారు.
రెండు స్థానాలను ఏపీకి కేటాయించడం ద్వారా టీడీపీ, జనసేనలతో తమకున్న బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండు స్థానాల్లో ఒకటి జనసేనకు, ఒకటి టీడీపీకి దక్కుతుందని అంటున్నారు. ఇదినిజమేనని.. ఎప్పటి నుంచో ఆయా పార్టీలు ఎదురు చూస్తున్న అంశానికి పరిష్కారం లభిస్తోందని బీజేపీ అగ్రనేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే.. ఈ రెండు సీట్ల విషయంలో నిర్ణయం ఏపీ పార్టీలకే వదిలేయనున్నారని సమాచారం. ఏదేమైనా మరో 15 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానుందని అంటున్నారు.
