Begin typing your search above and press return to search.

ఏపీలో సినీ స్టూడియోలు-కూటమి బిగ్ ప్లాన్

ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే విషయంలో కూటమి ప్రభుత్వం పట్టుదల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నపుడు కూడా సినీ పరిశ్రమను ఏపీలో విస్తరించేందుకు కృషి చేసింది.

By:  Satya P   |   5 March 2026 9:31 AM IST
ఏపీలో సినీ స్టూడియోలు-కూటమి బిగ్ ప్లాన్
X

ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే విషయంలో కూటమి ప్రభుత్వం పట్టుదల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నపుడు కూడా సినీ పరిశ్రమను ఏపీలో విస్తరించేందుకు కృషి చేసింది. అయితే ఇపుడు మరోసారి అధికారంలోకి రావడంతో ఆ ప్రయత్నాలు మరింతగా ఊపు అందుకుంటున్నాయి. సినీ రంగం టీవీ రంగం వీటి వల్ల కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తగిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు.

నాలుగు చోట్ల స్టూడియోలు :

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేసే క్రమంలో కీలకమైన నాలుగు ప్రాంతాలలో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని అంటున్నారు. అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాలలో సినిమా స్టూడియోల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తుంది అని చెబుతున్నారు. అంటే స్టూడియోలు నిర్మించేందుకు సినీ పెద్దలు ఎవరైనా వస్తే కనుక వారికి మౌలిక సదుపాయల కల్పన విషయంలో ఇబ్బందులు లేకుండా తగిన విధంగా సహకరిస్తుందని చెబుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే విశాఖలో రామానాయుడు స్టూడియో నిర్మాణం జరిగింది అన్నది కూడా గుర్తు చేస్తున్నారు.

సినీ రంగానికి పెద్ద పీట :

ఏపీలో సినీ, టెలివిజన్ రంగానికి పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ రెండు రంగాలకు ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలని కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సినీ టీవీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా సీరియస్ గా ప్రభుత్వం పరిశీలిస్తోంది అని ఆయన చెబుతున్నారు.

టీవీ కళాకారులకు అండగా :

సినీ టీవీ రంగాలలో సుదీర్ఘకాలం పనిచేసిన కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. ఇక గత 45 ఏళ్లుగా టీవీ పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, కళాకారుల ఉపాధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు చలనచిత్ర పరిశ్రమతో సమానంగా టీవీ రంగానికి కూడా గుర్తింపునిచ్చేలా విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి హామీ ఇవ్వడం విశేషం. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టీవీ నగర్ గా రూపకల్పన చేసి అక్కడ టీవీ కళాకారులకు నివాస స్థలాలు ఇచ్చే ప్రతిపాదన ఉంది అని అన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న టీవీ నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని మంత్రి చెబుతున్నారు. ఇక ఉగాది పురస్కారాలలో టీవీ కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.