ఖర్చే తప్ప.. ఆదాయం ఏది.. ఏపీలో ఆర్థికం ఆపశోపాలు.. !
రాష్ట్రంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఓ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
By: Garuda Media | 18 Sept 2025 6:00 AM ISTరాష్ట్ర ప్రభుత్వం వరుసగా చేస్తున్న కార్యక్రమాలను గమనిస్తే ఖర్చు తప్ప ఆదాయం కనిపించడం లేదన్నమాట వినిపిస్తోంది. ఇది విపక్ష నాయకులు చేస్తే విమర్శ అవుతుంది. కానీ స్వపక్షంలోని నాయకులే పెదవి విరిచే పరిస్థితి కనిపిస్తుండడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మాట ఎలా ఉన్నా ఖర్చుపై అసలు పగ్గాలు లేకుండా వ్యవహరిస్తోందన్నది టిడిపి నాయకులు చేస్తున్న విమర్శ. ఖర్చును అదుపు చేసుకునే క్రమంలో కొన్ని కొన్ని కార్యక్రమాలను తగ్గించాలని గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు.
రాష్ట్రంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఓ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చేస్తున్న కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి గాని ప్రభుత్వానికి కానీ రూపాయి ఆదాయం లేకపోగా ఖర్చు మిగులుతుంది అన్నది ఆయన చెప్పిన మాట. ఇటీవల తిరుపతి వేదికగా పార్లమెంటు, అసెంబ్లీ మహిళ ప్రజా ప్రతినిధుల సాధికారత సదస్సును నిర్వహించారు. దీనికి సుమారు 80 నుంచి 120 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇంత భారీ కార్యక్రమానికి వేదిక కావడం గొప్ప విషయమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. రావాల్సినంత మైలేజీ రాకపోగా ఇది అనవసరపు ఖర్చు అనే మాట వినిపిస్తుండడం రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. 80 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదన్నది కూడా అధికార పార్టీ నేతల మాట. మహిళా ప్రజా ప్రతినిధులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అంశాలపై రెండు రోజుల పాటు తిరుపతిలో సభ పెట్టారు. దీనికి పార్లమెంటు నుంచి స్పీకర్లు అదేవిధంగా మహిళా పార్లమెంటరీ నాయకులు రాష్ట్రాల నుంచి అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఇలా సుమారు 600 మంది దాకా హాజరయ్యారు.
వీరికి తోడు వారి పిఏలు మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. దీంతో ఖర్చు తడిసి మోపిడైందన్నది అధికారులు చెబుతున్న మాట. దీనివల్ల ప్రయోజనం లేకపోగా ఖర్చు పెరిగిందని వారు లెక్కలు వేస్తున్నారు. ఇక ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సు కూడా దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చును మిగిల్చింది. ఇది కూడా వాస్తవం. జిల్లాల కలెక్టర్లకు రావడానికి, పోవడానికి అయ్యే ఖర్చులతో పాటు వారికి కల్పించిన ఉన్నత స్థాయి సౌకర్యాలు, ఉండేందుకు హోటళ్లు, భోజనం.. వారి పిఏలు అదేవిధంగా సెక్రటరీలు ఇలా అన్ని రూపాల్లోనూ ప్రభుత్వం పై పది నుంచి 15 కోట్ల రూపాయలు వరకు భారం పడింది.
ఇక తరచుగా చేస్తున్న ఢిల్లీ పర్యటనల ఖర్చు కూడా మరింత ఎక్కువగా ఉందన్నది ప్రభుత్వ వర్గాల్లోనే జరుగుతున్న చర్చ. ఇటీవల చంద్రబాబు వరుసగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. దీనికి ముందు నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పర్యటనకు వెళ్లడం తప్పు కాదు. కానీ, వృధా పర్యటనల వల్ల ఆర్థికంగా భారం పడుతుందన్నది అధికారులు చెబుతున్న మాట. దీనివల్ల ఖజానాపై భారం పడి అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
వృధా ఖర్చులను తగ్గించాలని చెబుతున్న సీఎం చంద్రబాబు.. వృధా ఖర్చులకు అనుకూలంగా ఉండే కార్యక్రమాలను నిర్వహించడం ఎందుకన్నది ప్రశ్న. మొత్తానికి వృధా ఖర్చును కనుక తగ్గించుకోకపోతే ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుంది అన్నది ఆర్థిక శాఖ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవరూ బయటకు చెప్పకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఈ విషయంపై సచివాలయంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండడం గమనార్హం.
