బడి పిలుస్తోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీ చేరికలు!
ఏపీ విద్యా రంగంలో తీసుకువచ్చిన మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వం, ఉపాధ్యాయుల చర్యలతో ఈ ఏడాది భారీగా చేరికలు పెరిగాయని అధికారులు ప్రకటించారు.
By: Tupaki Political Desk | 26 Jun 2026 10:51 AM ISTఏపీ విద్యా రంగంలో తీసుకువచ్చిన మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వం, ఉపాధ్యాయుల చర్యలతో ఈ ఏడాది భారీగా చేరికలు పెరిగాయని అధికారులు ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ బడుల దారిన పట్టిన వారి సంఖ్యే దాదాపు లక్ష దాటిందని అధికారులు వెల్లడించారు. సహజంగా సర్కారు పాఠశాలల నుంచి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు విద్యార్థులు వలస వెళుతుంటారు. అయితే ఈ ఏడాది రివర్స్ మైగ్రేషన్ తో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని అంటున్నారు. ప్రైవేటు నుంచి భారీగా విద్యార్థులు చేరడంతో రాష్ట్రంలోని 7,620 యూపీ స్కూళ్లు గరిష్ట సామర్థ్యం మేరకు అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మార్పు వెనుక విద్యారంగంలో తీసుకువచ్చిన వ్యూహాత్మక సంస్కరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా చేపట్టిన 'బడి పిలుస్తోంది' వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు. కేవలం అడ్మిషన్లకే పరిమితం కాకుండా, 'మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్' ద్వారా పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం, వారి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా పాఠశాలల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో సర్కారు బడులపై నమ్మకం పెరిగిందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ల ఫీజులు భరించలేని తల్లిదండ్రులు సర్కారు బడులపై విశ్వాసంతో చేర్పిస్తున్నారని చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయలలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేటుకు దీటుగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల వివరాలతో ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం కూడా ఉపాధ్యాయుల్లో జోష్ తీసుకువచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన మెరుగైన ఫలితాల పట్ల ప్రచారం పెరగడం సానుకూల వాతావరణం కల్పించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 159 పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. అదేవిధంగా లీప్ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు మేథ్స్, సైన్స్ సబ్జెక్టులకు ఏఐ ట్యూటర్ విధానం ప్రవేశపెడుతున్నారు. 175 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం తీసుకువస్తున్నారని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని అంటున్నారు.
