Begin typing your search above and press return to search.

ఉద్యోగుల జీతాల భారం...ఖజానా మీద ఎంత ?

కేవలం గత ఆర్థిక సంవత్సరమే కాకుండా పదేళ్ళ ఏపీ ఆదాయం ఉద్యోగుల జీత భత్యాల డేటా కూడా ఇపుడు ఉద్యోగ సంఘాలు విడుదల చేశాయి.

By:  Satya P   |   10 Aug 2026 9:28 AM IST
ఉద్యోగుల జీతాల భారం...ఖజానా మీద ఎంత ?
X

ఎక్కడైనా పనిచేసే ఉద్యోగులకు జీత భత్యాలు తప్పనిసరిగా చెల్లించాలి. కానీ మొత్తం ఆదాయం ఇవ్వడం అంటే కుదరదు కదా. ప్రభుత్వం అంటే సామూహిక కుటుంబం లాంటిది. ఒక కుటుంబంలో పనిచేసే వారికి ఇచ్చే జీతానికి ఒక లెక్క ఉంటుంది. నూరు శాతం ఇవ్వలేరు. అలా చేస్తే ఆ కుటుంబం మిగిలిన ఖర్చులు అభివృద్ధి అన్నీ ఆగిపోతాయి. అలాగే ప్రభుత్వం కూడా కుటుంబం అనుకుంటే అందులో కొంత శాతమే ఉద్యోగుల జీత భత్యాలకు పెట్టాల్సి ఉంటుంది. అది సబబు కూడా. మరి చూస్తే రాను రానూ ఉద్యోగుల జీత భత్యాలు పెరిగిపోతున్నాయని ఒక వాదన ఉంది. దాంతో ఖజానా మీద పెను భారం పడుతోంది అన్న చర్చ కూడా ఉంది. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఒక ఆర్ధిక శ్వేతపత్రం చూస్తే అందులో రాష్ట్ర ఆదాయంలో అత్యధిక భాగం జీతాలకు పోతోంది అన్నది అయితే ఉంది. మరి ఎంత శాతం ఏమిటి అన్న దాని మీద అయితే చర్చోపచర్చలు సాగుతున్నాయి.

మూడవ వంతు మాత్రమే అంటూ :

ఇక దీని మీద ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయితే తమదైన శైలిలో స్పష్టతను ఇచ్చాయి. తమ జీత భత్యాలు అన్నీ కలుపుకున్నా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కానీ అయ్యే ఖర్చులో కానీ మూడవ వంతు కంటే ఎక్కువ లేదని వివరిస్తున్నాయి. దాని కోసం కాగ్ నివేదికను ఇక కాగ్ నివేదిక ప్రకారమే చూస్తే కనుక 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.2.26 లక్షల కోట్లుగా ఉంది. అందులో ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకు ఖర్చు చేసింది రూ.84,401 కోట్లుగా పేర్కొన్నట్లుగా ఉద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. ఇది కేవలం 37 శాతం మాత్రమేనని అని చెబుతున్నాయి. అలాగే ఏపీకి పన్నుల ఆదాయం 2025-26లో చూస్తే లక్షా 42 వేల కోట్లు ఉందని ఇందులో ఉద్యోగుల ఖర్చు చూస్తే 59 శాతంగా ఉందని, ఇక మొత్తం ఆదాయం లెక్క తీసి చూస్తే లక్షా 78 వేల కోట్లలో ఉద్యోగుల జీత భత్యాలు అన్నవి 47 శాతంగా మాత్రమే అని సంఘాల నేతలు వెల్లడిస్తున్నారు.

పదేళ్ళలో లెక్క ఇలా :

కేవలం గత ఆర్థిక సంవత్సరమే కాకుండా పదేళ్ళ ఏపీ ఆదాయం ఉద్యోగుల జీత భత్యాల డేటా కూడా ఇపుడు ఉద్యోగ సంఘాలు విడుదల చేశాయి. వాటి ప్రకారం చూస్తే 2016-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీత భత్యాలకు 31,125 కోట్లు ఖర్చు చేశారు. ఇది రెవిన్యూ ఆదాయాలలో 31.44 శాతం, రెవిన్యూ ఖర్చులలో 26.78 శాతం అని అంటున్నాయి. 2017-18లలో చూస్తే 32,816 కోట్లు ఖర్చు ఉద్యోగుల జీత భత్యాలకు అయింది. ఆదాయంలో ఇది 31.23 శాతంగా ఉంటే రెవిన్యూ ఖర్చులలో 27.07గా ఉంది. 2018-19లలో చూస్తే 35,240 కోట్లు ఉంటే ఇది రెవిన్యూ ఆదాయంలో 30.73 శాతంగా, ఖర్చులలో 27.41 శాతంగా ఉంది. 2019-20లలో చూస్తే ఉద్యోగుల జీత భత్యాలు పెరిగాయి. ఈ లెక్క చూస్తే 36,934 కోట్లు ఉంటే అది రెవిన్యూ రాబడిలో 33.26 శాతం రెవిన్యూ ఖర్చులో 26.37 శాతంగా ఉంది.

పెరుగుతున్న వైనం :

ఇక 2020-21లలో చూస్తే 40,582 కోట్లుగా ఉద్యోగుల జీత భత్యాలు ఉంటే రెవిన్యూ రాబడిలో 34.65 శాతం, రెవిన్యూ ఖర్చుగ 26.58 శాతంగా ఉంది. 2021-22లలో చూస్తే ఉద్యోగుల జీత భత్యాలు 42,738 కోట్లుగా ఉంది. ఇది రెవిన్యూ రాబడిలో 28 శాతంగా ఉంటే రెవిన్యూ ఖర్చులో 27 శాతంగా ఉంది. 2022-23 లలో చూస్తే 53,867 కోట్లుగా ఉద్యోగుల జీత భత్యాలు ఉన్నాయి, ఇది రెవిన్యూ రాబడిలో 34,14 శాతంగా ఉంటే రెవిన్యూ ఖర్చులో 26.77 శాతంగా ఉంది. ఇక గత ఏడాదికి ఈ జీత భత్యాల ఖర్చు కాస్తా 84 వేల కోట్లు పై దాటింది అని లెక్కలు చెబుతున్నాయి.

భారాలు గానేనా :

అయితే మరో వైపు నుంచి చూస్తే దక్షిణాదిన ఇతర రాష్ట్రాలలో కంటే కూడా ఏపీలో ఎక్కువ జీతాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కొత్త పీఆర్సీ కనుక వేస్తే ఈ జీతాలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. అపుడు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఏటా బడ్జెట్ లో కేటాయింపులు చేయాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఏపీకి ఆదాయం చూస్తే పరిమితంగానే వస్తోంది. రానున్న రోజులలోనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. దాంతో ప్రస్తుతానికి చూస్తే ఖజానాకి ఏ పెంపుదల అయినా పెను భారమే అవుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.