జగన్ ఫొటోల తొలగింపు ఖర్చు రూ.50 కోట్లు!
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫొటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది.
By: Tupaki Political Desk | 30 Dec 2025 1:13 PM ISTమాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫొటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రభుత్వానికి ఈ వ్యయం మరింత భారంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం భారమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరించక తప్పని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీతోపాటు పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరిచేసే క్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేశారు. వీటి స్థానంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం పేరిట కొత్త పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఫొటోను ముద్రించారు. రైతు భూమికి జగన్ ఫొటో ఎందుకని అప్పట్లోనే ప్రశ్నలు వినిపించినా, ప్రభుత్వ విధానం కావడంతో ఎవరూ ఏం అనలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని కొందరు రైతులు ఈ విషయమై నిలదీయడం కూడా జరిగింది.
దీంతో ఈ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. అప్పడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో ఇచ్చిన జగనన్న భూ రక్ష పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా చేసిన సర్వే తప్పుల తడకగా ఉందనే విమర్శలు సైతం నాటి ప్రతిపక్షాలకు కలిసివచ్చింది.
ఇక కూటమి ప్రభుత్వం హామీ మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జగనన్న భూ రక్ష పుస్తకాలను వెనక్కి తీసుకోడానికి రంగం సిద్ధం చేసింది. రైతుల భూ రికార్డులను ముద్రించి వాటిపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ప్రింట్ చేసి ఈ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నరైతులకు 21.80 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ నెల 2వ తేదీ నుంచి అందించనున్నారు. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నుంచి అనేక భూ వివాదాలు వెలుగు చూడటం కూడా ప్రభుత్వ తాజా నిర్ణయానికి కారణమైందని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం, గత ప్రభుత్వం చేసిన సర్వే వల్లే ఎక్కువ వివాదాలు చెలరేగడం వల్ల గత 18 నెలలుగా ప్రభుత్వం వాటి పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుందని చెబుతున్నారు. ఇంకా కొన్నిచోట్ల వివాదాలు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పటికే కాలతీతం అయిపోవడం, రైతుల్లో అనుమానాలు తొలగకపోవడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రెవన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
