సస్పెన్షన్ లోనే పీవీ సునీల్ రిటైర్మెంట్...ఎంక్వైరీ మాత్రం !
సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ జూన్ 30న రిటైర్ కాబోతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By: Satya P | 29 Jun 2026 11:32 PM ISTసస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ జూన్ 30న రిటైర్ కాబోతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ జూన్ 30న మధ్యాహ్నం సర్వీసుల నుంచి రిటైర్ అవుతున్నారు. ఆయన 1993 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ హోదాలలో పనిచేసిన సునీల్ కుమార్ ఆ మధ్య సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేయడం ఆమోదిత ప్రయాణ ప్రణాళికలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ అప్పీల్ నిబంధనల రూల్ 3(1) కింద గత మార్చిలో పీవీ సునీల్ ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సస్పెన్షన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
పొడిగించిన ప్రభుత్వం :
ఇక పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను ఆయన పదవీ విరమణ చేసే తేదీ అయిన 2026 జూన్ 30 వరకు లేదా ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పొడిగించింది. నిజానికి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఫిబ్రవరి 24తో ముగియనున్న నేపథ్యంలో ఆయనపై దాఖలైన ఇతర క్రిమినల్, శాఖాపరమైన విచారణలు ఆరోపణలను వాటి వివిధ దశలను కూడా సమీక్షా కమిటీ పరిశీలించింది. మరో వైపు చూస్తే ఆయన మీద విచారణ జరుగుతొంది. దీంతో పాటు, డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ కె. రఘు రామ క్రిష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ కుమార్‌పై కేసు నమోదైంది.
విచారణ కొనసాగుతుంది :
పీవీ సునీల్ కుమార్ పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో ఆయన మీద విచరాణ ఏమి జరుగుతుంది అన్న దాని మీద క్లారిటీ ఉంది. ఆయన విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆల్ ఇండిహ్యా సర్వీసెస్ 1958 నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ఉతర్వులో పేర్కొంది. ఆయన రిటైర్మెంట్ ముందే ప్రారంభం అయిన ఈ విచారణ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969 తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం వీటిని ముగింపు దశకు తీసుకుని వస్తామని ప్రభుత్వం పేర్కొంది.
పెన్షన్ ప్రయోజనాల గురించి :
ఇక పీవీ సునీల్ కుమార్ కి అందాల్సిన పెన్షన్ తదితర ఆర్ధిక ప్రయోజనాల గురించి కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1958 లోని రూల్ 16 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమబద్ధీకరించడం జరుగుతుంది అని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో ఆదేశించింది.
