అక్కడ కొత్త జిల్లా..వద్దే వద్దు !
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లలా గురించి ప్రస్తావన వస్తోంది.
By: Satya P | 2 Nov 2025 8:41 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లలా గురించి ప్రస్తావన వస్తోంది. వైసీపీ ప్రభుత్వం 2022లో కొత్తగా మరో 13 జిల్లాలను చేసింది. ఇవన్నీ కూడా ఎంపీ సీట్ల ఆధారంగా చేశారు. అయితే వీటికి శాస్త్రీయత పెద్దగా లేదని అనేక ఇబ్బందులు సెంటిమెంట్లు ఉన్నాయని వాటిని విస్మరించి విడగొట్టారు అని కూటమి పార్టీలు విపక్షంలో ఉన్నపుడు ఘాటుగా విమర్శించాయి. తాము అధికారంలోకి వచ్చినపుడు సవరిస్తామని ప్రజల ఆమోదంతో వారి కోరికలు ఆకాంక్షలు అన్నీ చూసి మరీ తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.
ఉప సంఘం ఏర్పాటుతో :
ఇక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా జిల్లాల పునర్ విభజన మీద ఏర్పాటు చేశారు. ఈ ఉప సంఘం అనేక వినతులు అభ్యర్ధనలు ఫిర్యాదులు అన్నీ పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేసిందని వార్తలు వచ్చాయి. ఇక మరోసారి తాజాగా మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరిపి కొత్త జిల్లాల మీద తుది నివేదికను తయారు చేసే పనిలో ఉందని కూడా చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాలుగా కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఆరు ఉంటాయని కూడా అంటున్నారు.
సిక్కోలుని విడగొట్టొద్దు :
ఇక ఆరు కొత్త జిల్లాలలో ఉత్తరాంధ్రాలోని చివరి జిల్లా అయిన శ్రీకాకుళం ఉందని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేంద్రంగా కొత్త జిల్లా వస్తుందని కూడా ప్రచారం సాగుతోంది పలాస టెక్కలి, ఇచ్చాపురం, పాతపట్నంతో కలుపుకుని కొత్తగా జిల్లాని తెస్తారు అని అంటున్నారు. పలాస కేంద్రంగా జిల్లాను చేయడం ద్వారా మంచి ప్రగతి సాధించేందుకు వీలు ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే మూలపేట పోర్టు నిర్మాణం అవుతోంది. అలాగే కార్గో ఎయిర్ పోర్టుకి ప్రతిపాదనలు ఉన్నాయి. కచ్చితంగా పోర్టుని కడతామని పౌర విమాన యాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. ఇక్కడే ఉద్ధానం కొబ్బరి తోటలు జీడి పరిశ్రమ వంటివి ఉన్నాయి. దాంతో కొత్తగా జిల్లా చేస్తే పలాస బాగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
శ్రీకాకుళం చిన్నబోతుంది :
అయితే శ్రీకాకుళం జిల్లా చిన్నబోతుంది అని జిల్లా వాసుల నుంచి ఒక అభిప్రాయం వస్తోంది. ఒకనాడు ఎంతో పెద్ద జిల్లాగా చరిత్ర కలిగిన ప్రాంతంగా శ్రీకాకుళం ఉందని దానిని 2022లో నే కేవలం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో తగ్గించేశారు అని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు లేని జిల్లాగా మారిందని ఇపుడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలతో పలాస జిల్లా చేస్తే కనుక కచ్చితంగా శ్రీకాకుళం ప్రగతి తగ్గుతుందని ఏ విధంగానూ అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉండదని అంటున్నారు. దాంతో ఈ ప్రతిపాధన మీద వస్తున్న ప్రచారానికి అయితే చాలా మంది నుంచి వ్యతిరేకత వస్తోంది. శ్రీకాకుళం జిల్లాను అలగే ఉంచాలని వీలైతే రాజాం, పాలకొండలను వెనక్కి తేవాలని కూడా కోరుతున్నారు మరి ఏమి జరుగుతుందఒ చూడాల్సి ఉంది.
