ఏపీలో మందుబాబులకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్ ఇదే!
ఇదే సమయంలో బార్లకు 1 గంట వరకూ అనుమతి ఇచ్చింది ప్రభుత్వం! నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
By: Raja Ch | 30 Dec 2025 11:00 AM ISTన్యూ ఇయర్ వేడుకలకు రంగం సిద్ధమైంది.. ఈ రోజు కళ్లు మూసుకుంటే రేపు సాయంత్రం నుంచే సంబరాలు మొదలైపోతాయి. మందు, విందు, చిందు అంటూ కుర్రాళ్లు ఇప్పటికే రకరకాల ప్లాన్స్ వేసుకున్నారని అంటున్నారు. మరోవైపు శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించొద్దని, తాగి వాహనాలు నడపొదని పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలో మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
అవును... హైదరాబాద్ వంటి నగరాల్లో అర్ధరాత్రి వరకూ మందుబాబుల ఆనందాలకు అనుమతి ఉంది కానీ.. ఏపీలో ఊర్లలోని మాకు మాత్రం లేదు అనే ఆవేదనలో చాలా మంది ఉన్నారని అంటున్నారు! ఈ సమయంలో బ్లాక్ మార్కెట్, బెల్ట్ షాపులు అందిన కాడికి దోచుకుంటున్నాయని మొత్తుకుంటున్నారని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఇందులో భాగంగా... డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకూ కొనసాగించనున్నారు.
ఇదే సమయంలో బార్లకు 1 గంట వరకూ అనుమతి ఇచ్చింది ప్రభుత్వం! నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం... బార్లకు, ఇన్ హౌస్ లైసెన్సులు కలిగి ఉన్న ప్రదేశాలకు.. న్యూఇయర్ ఈవెంట్స్ పర్మిట్ లైసెన్స్ పొందినారికి కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. గ్రామాల్లోని వైన్ షాపులకు సైతం రాత్రి 12 గంటల వరకూ అనుమతి ఇచ్చారని అంటున్నారు!
అదేవిదంగా.. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే లైసెన్సులకు కూడా ఈ సడలింపు వర్తిస్తుందని.. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వబడిందని అంటున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ పర్యాటకులు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.
అయితే... శాంతిభద్రతలను, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో.. సమన్వయంతో పనిచేస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి వేడుకలను ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నారు!
అయితే.. ఈ అనుమతుల మాటున మద్యంసేవించి వాహనాలు నడిపితే మాత్రం రూల్స్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని.. ఈ న్యూఇయర్ అందరి ఇళ్లల్లోనూ ఆనందాలు నింపాలి కానీ.. విషాదాలు నింపేలా ఎవరూ ప్రవర్తించకూడదని అధికారులు చెబుతున్నారు! సంబరాలు సంతోషాలు ఇవ్వాలి కానీ, విషాదాలు కాదని నొక్కి చెబుతున్నారు!
