Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రభుత్వం కొట్టాలంటే ఇదే ఛాన్స్ !

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి అన్నది 34 ఏళ్ళుగా విధింపు ఉంది.

By:  Satya P   |   16 Sept 2026 7:41 AM IST
ఏపీలో ప్రభుత్వం కొట్టాలంటే ఇదే ఛాన్స్ !
X

ఏపీలో నిరుద్యోగులకు ఇదే గోల్డెన్ చాన్స్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలీ అంటే లక్కీ చాన్స్ అని కూడా అనాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వారు అంతా ఏజ్ బార్ అయి సైడ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటి వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలీ అంటే ఇపుడు వయసు దాటిపోయింది అన్నది అడ్డంకి కానే కాదు. అభ్యర్ధి సామర్థ్యం ప్రతిభ ఉంటే చాలు నాలుగున్నర పదుల వయసులో కూడా సర్కార్ కొలువులో చేరేందుకు ఆస్కారం కల్పిస్తూ ప్రభుత్వం శుభ వార్తనే చెప్పింది.

గరిష్ట వయసు పదేళ్ళు పెంచుతూ :

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గరిష్టంగా వయసుని మరో పదేళ్ళు ప్రభుత్వం పెంచింది. దాంతో సాధారణంగా ఉండే 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి కాస్తా 44 ఏళ్ళకు పెరిగినట్లు అయింది. అంటే వయసు బాధను పక్కన నెట్టేసేలా ప్రభుత్వం ఒక చల్లని హామీ ఇచ్చింది అన్న మాట. దాంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా చూస్తున్న వారికి ఇది అరుదైన అవకాశంగా చెప్పాల్సి ఉంది. కేవలం వయోపరిమితి ఒక అనర్హతగా మారి ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమైన ఎంతో మందికి ఇది భారీ ఊరటను ఇచ్చే అంశంగా చెబుతున్నారు. దీంతో వేలల్లోనే లబ్దిని అనేక మంది అభ్యర్థులు పొందుతారు అని అంటున్నారు.

ఏడాది పాటు చాన్స్ :

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి అన్నది 34 ఏళ్ళుగా విధింపు ఉంది. ఇక ఈ ప్రత్యేక వయోపరిమితి సడలింపు అన్నది కూడా మరో ఏడాది పాటు అంటే 2027 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చేపట్టే సంబంధిత నాన్ యూనిఫామ్ పోస్టులకు సంబంధించి అనేకమైన ప్రత్యక్ష నియామకాలకు పెంచిన గరిష్ట వయోపరిమితి వర్తించనుంది. ఈ విధంగా చేయడం వల్ల నడిమి వయసులో కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు ఆస్కారం దక్కనుంది.

ఆ ఉద్యోగాలకు లేదు :

అయితే ఈ పదేళ్ల పాటు వయసు సడలింపు అన్నది అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదని చెబుతున్నారు. ముఖ్యంగా యూనీ ఫార్మ్ పోస్టులు అయిన పోలీస్ ఎక్సైజ్ ఫైర్ జైళ్లు అటవీ రవాణా శాఖలకు చెందిన యూనిఫామ్ ఉద్యోగాలు అదే విధంగా భౌతిక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండే పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని నిబంధనలు చెబుతున్నారు అయితే ఈ పోస్టులకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని రూల్ 12 ప్రకారం వివిధ కేటగిరీలకు అందుతున్న అదనపు వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని అంటున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈ డబ్య్లూఎస్ తదితర కేటగిరీలకు వర్తించే నిబంధనల ప్రకారం అదనపు వయోపరిమితి ప్రయోజనం పొందవచ్చునని చెబుతున్నారు.