ఇల్లు లేని వారికి కూటమి గుడ్ న్యూస్
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా ప్రచారంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని అవసరమైన వారికి ఇల్లు కట్టించి ఇస్తామని ప్రచారం చేసింది.
By: Satya P | 23 Oct 2025 9:00 AM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం శుభ వార్త వినిపించింది. పట్టణంలో గ్రామాలలో పేదలుగా ఉంటూ ఇళ్ళు లేని వారికి ఒక అవకాశం ఇస్తున్నట్లుగా చెబుతోంది వారంతా తక్షణ దరకాస్తు చేసుకోవాలని కోరింది. పట్టణ ప్రాంతాలలో అయితే రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్ల స్థలం వారికి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు ఇంకా పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు ప్రతిపాదన :
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా ప్రచారంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని అవసరమైన వారికి ఇల్లు కట్టించి ఇస్తామని ప్రచారం చేసింది. ఆ మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతంలో భూములు స్థలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి రెండు సెంట్లను ఇవ్వడానికి సుముఖంగా ఉంది. అలాగే రూరల్ ఏరియాలో అయితే మూడు సెంట్లు ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో ఇదే విషయం మరోసారి స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో :
వైసీపీ హయాంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని అంటున్నారు. దాంతో తమకు ఇబ్బందిగా ఉందని పేదలు పేర్కొన్నట్లుగా అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే దానిని సవరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వైసీపీ హయాంలో స్థలాలు తీసుకోని వారు ఉన్నా లేక అపుడు తక్కువ స్థలం తీసుకుని ఏ నిర్మాణాలు చేయని వారు ఉన్నా వాటిని స్వాధీనం చేస్తే తిరిగి ఈ కొత్తగా ఇచ్చే స్థలాలను తీసుకునేందుకు అర్హులు అని చెబుతున్నారు.
యాభై శాతం పైగా :
ఇదిలా ఉంటే పట్టణ ప్రాంతాలలో యాభై శాతానికి పైగా ఇళ్ళు ఇప్పటికే మంజూరు చేశామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. లబ్దిదారుల ఎంపిక కోసం నవంబర్ 5 వరకూ సర్వే నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలు అప్పటిదాకా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలా వచ్చిన దరఖాస్తులు అన్నీ కలిపి అర్హులైన వారికి తొందరలోనే ఇళ్ళ స్థాలు ఇస్తామని ఆయన చెప్పారు.
కూటమి వచ్చాక జాబ్స్ :
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు 7.28 లక్షల దాకా కొత్తగా ఇచ్చామని మంత్రి చెప్పారు. అదే విధంగా పెట్టుబడులు చూస్తే గత పదహారు నెలలలో 7.65 లక్షల కోట్ల రూపాయల అ మేర వచ్చాయని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద 75. 1 శాతం ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని మంత్రి చెప్పడం విశేషం.
