పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?
ఏపీలో 13,168 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 4,180 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను పెంచింది. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభాకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉంటే రూ.50 లక్షలు ఇవ్వనుంది.
By: Satya P | 13 Nov 2026 10:05 PM ISTఏపీలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. 13,168 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మొదటి తొలి విడతకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తొలి విడతలో 4,180 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రామాలలో పంచాయతీల ఎన్నికల హడావుడి ఒక వైపు మొదలైంది. సరిగ్గా ఈ సమయంలో కూటమి ప్రభుత్వం పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలు అయిన పంచాయతీలకు ఇంతవరకూ ఇస్తున్న మొత్తాలని ఏకంగా పెద్ద ఎత్తున పెంచేసింది. దాంతో అధిక శాతం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ దిశగా అడుగులు వేస్తాయని అంచనాగా ఉంది.
నగదు బహుమతులతో :
గ్రామాలలో శాంతియుతమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ఏకగ్రీవం అయిన వాటికి నగదు బహుమతిని ఇవ్వడం గతం నుంచి ఉంది. ఎన్నికలు లేకుండా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే పంచాయతీలకు ఈ బహుమతులు ఇస్తారు. దీని వల్ల గ్రామాలలో రాజకీయ విభేదాలు ఉండవు, అంతా కలిసి అభివృద్ధి చేసుకుంటారు. దీని వల్లనే ప్రభుత్వాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూంటాయి. గతంలో అయితే నాలుగు కేటగిరీలలో ఈ ప్రోత్సాహకాలను అందిస్తూ వచ్చేవారు. అలా చూస్తే కనుక కనిష్టంగా 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు, గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు మాత్రమే ప్రోత్సాహకం అందేది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ శ్లాబులను మూడు కేటగిరీలకు కుదించడమే కాకుండా భారీగా నగదు ప్రోత్సాహకాలు పెంచింది. ఇలా ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం అయిదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే 15 లక్షలు ఇస్తారు. 5,001 నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు 25 లక్షలు ఇస్తారు. 10 వేలకు పైగా జనాభా ఉన్న మేజర్ పంచాయతీలు ఏకగ్రీవమైతే ఏకంగా 50 లక్షల భారీ నగదు బహుమతిని ప్రభుత్వం అందించనుంది.
అభివృద్ధి కోసం :
ఇలా ఏకంగా అర కోటి దాకా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను ప్రభుత్వం కేటాయించడం అన్నది గొప్ప విషయం. దాంతో పంచాయతీలలో దీని మీద చర్చ మొదలైంది. ఏకగ్రీవాలు చేసుకుంటే నిధులు దండీగా వస్తాయి కదా అభివృద్ధి చేసుకోవచ్చు అన్నది గ్రామ పెద్దలలో ఉంది. అందుకే ఇపుడు ఏపీలో గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గ్రామ పెద్దలు రచ్చబండ వద్ద సమావేశాలు పెడుతున్నారు. ఎన్నికల ఖర్చులు ఉండవు, రాజకీయ కక్షలు అంతకంటే ఉండవు, గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయి, అభివృద్ధి కూడా సాగుతుంది అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు,డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు.
ఏకగ్రీవాల దిశగా :
ప్రభుత్వం రెట్టింపు నగదు బహుమతులు అందించడానికి ముదుకు రావడంతో ఏకగ్రీవాల దిశగా పంచాయతీలు ప్రయాణిస్తున్నాయని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలోనే ఈ ఏకగ్రీవాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ నజరానాలు ఇప్పుడు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధికి వారు ఓటేస్తున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామంగా కూడా చెబుతున్నారు.
