కొత్త వాహనాలు కొంటే 10 శాతం కట్టాల్సిందే !
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఇక మీదట కొత్తగా వాహనాలు కొనే వారికి ఆర్థిక భారం పడనుంది.
By: Satya P | 6 March 2026 6:00 AM ISTఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఇక మీదట కొత్తగా వాహనాలు కొనే వారికి ఆర్థిక భారం పడనుంది. అయితే ఇది ఉత్తమమైన ప్రయోజనం కోసమే అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అందుకే సెస్సు రూపంలో ఈ మొత్తాన్ని విధిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దాని వల్ల రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం ప్రకటిస్తోంది.
రహదారి భద్రత కోసం :
ఏపీ మోటారు వాహన పన్ను సవరణ బిల్లును కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ బిల్లులో పొందుపరచిన అంశాల మేరకు నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారికి పది శాతం సెస్సుని తప్పనిసరి చేశారు. ఇక మీదట వారు తప్పనిసరిగా కొనుగోలు సమయంలో ఈ సెస్సుని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు ఈ మొత్తాన్ని రహదారి భద్రత కోసం ప్రత్యేక నిధిగా ఉంచుతారు. అందుకే రహదారి భద్రత సెస్సుగా దీనిని పరిగణిస్తున్నారు.
ప్రమాదాల నివారణ :
ఇదిలా ఉంటే ఏపీలో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లుని కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇక వాహనాల కొనుగోలు సమయంలోనే అంటే రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లించే వాహనాలపై పది శాతం రహదారి భద్రతా సెస్సు విధించనున్నట్లు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
భారీ యాక్షన్ ప్లాన్ :
ఇక ఈ విధంగా పోగు చేసిన ప్రత్యేక నిధులను రహదారి భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లాక్‌స్పాట్ల మెరుగుదల కోసం ఖర్చు పెడతారు. అలాగే ప్రమాదాల తగ్గింపునకు కూడా ఈ మొత్తం నుంచే వినియోగించనున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ పది శాతం సెస్సుతో రాష్ట్రానికి నెలకు సుమారు22.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, సంవత్సరానికి 270 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భారమేనా :
అయితే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈ పది శాతం సెస్సు అదనపు భారమే అని అంటున్నారు. మరి ఈ పది శాతం వాహనం మొత్తం విలువ నుంచి కట్టి తీసుకుంటారా లేక ఆన్ రోడ్ రేట్ మీద కడతారా అన్నది చూడాల్సి ఉంది. ఆన్ రోడ్ అంటే అప్పటికే జీఎస్టీ సహా వాహనం యొక్క బేస్ రేటు ఉంటుంది. అలాగే ఆర్టీవో రిజిస్ట్రేషన్ రోడ్డు పన్ను బీమా, ఇతర ఛార్జీలు వంటివి ఉంటాయి. వీటితో కలుపుకుంటే తడిసి మోపెడు అవుతుంది. ఆ టోటల్ రేటు మీద పది శాతం సెస్సు అంటే ఎక్కువగానే పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి చేస్తారో కానీ కొత్తగా వాహనాలు కొనే వారికి మాత్రం ఈ సెస్సు చెల్లించడం అనివార్యం కాబోతోంది అంటున్నారు.
