Begin typing your search above and press return to search.

డేటా ఇండస్ట్రీలో వరల్డ్ నెంబర్ వన్ ఏపీ.. ఈ ఘనత ఎలా దక్కిందో తెలుసా?

ఆధునిక సాంకేతికతలో ఏపీ రికార్డు నమోదు చేసింది. డేటా సెంటర్ల సామర్థ్యంలో ప్రపంచ నంబర్ వన్ గా అవతరించింది.

By:  Tupaki Political Desk   |   10 Oct 2025 3:52 PM IST
డేటా ఇండస్ట్రీలో వరల్డ్ నెంబర్ వన్ ఏపీ.. ఈ ఘనత ఎలా దక్కిందో తెలుసా?
X

ఆధునిక సాంకేతికతలో ఏపీ రికార్డు నమోదు చేసింది. డేటా సెంటర్ల సామర్థ్యంలో ప్రపంచ నంబర్ వన్ గా అవతరించింది. ప్రస్తుతం వర్జీనియాలో మాత్రమే 1.3 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ ఉంది. ఇప్పటివరకు ఇదే ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్. అయితే ఈ రికార్డును త్వరలో ఏపీ చెరిపేయబోతోంది. విశాఖలో మూడు సంస్థలు డేటా సెంటర్లు పెట్టనున్నాయి. దీంతో లక్షన్నర మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ఏపీ ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్న విశాఖ నగరం ప్రపంచ డేటా సెంటర్ గా ఆవిర్భవించనుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ విశాఖలోని మూడు ప్రాంతాల్లో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రైడెన్ ఇన్ఫోతోపాటుగా టీసీఎస్, సిఫీ కూడా డేటా సెంటర్లు పెట్టేందుకు నిర్ణయించుకున్నాయి.

విశాఖలో టీసీఎస్ రెండు గిగావాట్ల డేటా సెంటర్ పెట్టేందుకు అవసరమైన ప్రోత్సాహం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించింది. ఇందుకు సీఎం అంగీకరించడంతో త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటారని చెబుతున్నారు. ఇక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో ఒక డేటా గిగావాట్, సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. దీంతో విశాఖలో ఏకంగా మూడున్నర గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో రాష్ట్రం అంతర్జాతీయంగా నంబర్ వన్ గా నిలువనున్నదని ఐటీ శాఖ చెబుతోంది.

ఈ డేటా సెంటర్ల ద్వారా రానున్న ఐదేళ్లలో లక్షన్నర మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో రైడెన్ ఇన్ఫో అధికార ప్రకటన చేయనుంది. విశాఖ సమీపంలోని అచ్యుతాపురం, అడవివరం, తుర్లవాడల్లో 500 ఎకరాల్లో మూడు దశల్లో డేటా సెంటర్లు నిర్మించనుంది. ఇక 450 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సిఫీ ఈ నెల 11న డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్థాపనకు భూమి పూజ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఇలా మూడు సంస్థలు విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని అంటున్నారు. ఈ కీలక పెట్టుబడులు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాలే ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు ఉన్న పలుకుబడి వల్ల విదేశీ పెట్టుబడులతోపాటు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ఏపీని తమ సురక్షిత పెట్టుబడికి చిరునామా చేసుకుంటున్నట్లు విశ్లేషిస్తున్నారు.