ఉచిత బస్సు....వందల కోట్ల లాభం !
ఇక ఈ ఉచిత బస్సు పధకాన్ని ఏపీవ్యాప్తంగా మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ ల వరకూ ఎక్కే చాన్స్ ఉండడంతో చాలా సులువుగా వంద కిలోమీటర్ల దూరం ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.
By: Satya P | 16 Sept 2025 4:00 AM ISTఉచిత బస్సుని ఏపీలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విజయవాడలో ప్రారంభించారు. సరిగ్గా ఈ రోజుకు నెల అయింది. ఈ ముప్పయి రోజులలో ఉచిత బస్సు వల్ల ఎంత లాభం వచ్చింది, అనుకున్న లక్ష్యం చేరుకుందా, మహిళలకు ఏ విధంగా ఇది ఉపయోగపడింది అంటే దీని మీద సానుకూలమైన ఫలితాలే వచ్చినట్లుగా ప్రభుత్వానికి నివేదికలు ఉన్నాయి.
మహిళా లోకానికి గిఫ్ట్ :
టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఇది కీలకంగా ఉంది. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత బస్సు విషయంలో అన్ని రకాలైన కసరత్తులు చేసి మరీ 2025 ఆగస్టు 15న ఈ పధకాన్ని అమలు చేసింది. మహిళలకు ఇది ఒక బహుమతిగా ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా శ్రామిక మహిళలు ఉద్యోగినులు అలాగే విద్యార్ధినులు వీరంతా ఈ పధకానికి ప్రధాన లబ్దిదారులుగా ఉనారు.
ఎంత లాభం అంటే :
ఇక ఈ ఉచిత బస్సు పధకాన్ని ఏపీవ్యాప్తంగా మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ ల వరకూ ఎక్కే చాన్స్ ఉండడంతో చాలా సులువుగా వంద కిలోమీటర్ల దూరం ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పక్క జిల్లాలలు వెళ్తున్నారు. కన్నవారింటికి కానీ లేక తమ చుట్టాల ఇంటికి కానీ లేక విహారానికి కానీ దేవాలయాల సందర్శనకు కానీ ఉచిత బస్సుని వాడుకుంటున్నారు. దీంతో నెల రోజులుగా ఉచిత బస్సు ద్వారా మహిళలు అందుకున్న లాభం కానీ వారు మిగుల్చుకున్న ఆదాయం కానీ లెక్క వేస్తే కనుక అక్షరాలా 118 కోట్ల రూపాయలుగా తేలింది. ఇది ఎంతో భారీ మొత్తం కిందనే చెప్పాల్సి ఉంది. ఇదే ఒక ఏడాదికి హెచ్చవేస్తే 1500 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఇంతటి భారీ ఆర్థిక లాభం ప్రతీ ఇంటికీ చేకూర్చిన ఘనతను కూటమి ప్రభుత్వం అందుకుంది అని చెప్పాలన్న మాట. ఇక ఈ పధకం కింద 3.17 కోట్ల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులలో ప్రయాణించారు అని అంటున్నారు.
వీరందరి పర్సులలో :
పట్టణాలు నగరాల్లో మహిళలు చిరు ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాలను గడుపుతున్నారు. వారు ప్రతీ నెలా 1500 రూపాయలు బస్ పాస్ కోసం ఖర్చు చేస్తున్నారు. అలా వారి పర్సులలో ఇపుడు ఆ మొత్తం అలాగే మిగిలిపోయింది. అంతే కాదు విద్యార్ధినులు కూడా మూడు నెలలకు పదిహేను వందల స్టూడెంట్ బస్ పాస్ తీసుకునేవారు. ఇపుడు వారికి నెలకు అయిదు వందల రూపాయలు మిగులుతోంది ఇక రోజు వారీ కూలీ నాలీ పనులు చేసుకునేవారు ప్రధానంగా ఆటోలను ఆశ్రయించిఏవారు వారికి వచ్చే కూలీలో వంద రూపాయల దాకా ఈ ఆటో చార్జీలకే రోజుకు పోయేది. ఇపుడు వారికి నెలకు మూడు వేల దాకా మిగుతోంది అన్నది లెక్క చెబుతోంది.
ఆక్యుపెన్సీ రేటు పెరిగింది :
వీరు కాక మధ్యతరతి గృహిణులు తమ కుటుంబాలతో ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే వారి బడ్జెట్ లో వేయి రూపాయలు నెలలో ఖర్చు అయ్యేది. ఇపుడు మహిళలకు ఉచిత బస్సు వల్ల అయిదు వందల దాకా ఆదా అవుతోంది. దాంతో నెలకు రెండు మూడు సార్లు కూడా వెళ్ళగలుతున్నారు. ఇలా వివిధ వర్గాల మహిళలు అంతా స్త్రీ శక్తి పధకానికి జై కొడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇక బస్సులో మహిళల ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. 67 శాతం వారు ప్రయాణిస్తున్నరు. చూడాలి మరి ముందు ముందు ఏ విధంగా స్త్రీ శక్తిని చాటుకుంటారో.
