Begin typing your search above and press return to search.

ఉచిత బస్సుని మోస్తున్న కూటమి...వారు హ్యాపీనా !

ఏపీలో ఉచిత బస్సు పధకం కొనసాగాలీ అంటే ఏటా రెండు వేల కోట్ల రూపాయలు సర్కార్ ఖజానా నుంచి ఆర్టీసీకి కేటాయించాల్సిందే.

By:  Satya P   |   28 Dec 2025 11:00 AM IST
ఉచిత బస్సుని మోస్తున్న కూటమి...వారు హ్యాపీనా !
X

కాదేదీ ఉచితం అన్నట్లుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇస్తూంటాయి. అలా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి భారీ ఎత్తున నిధులను కూడా వెచ్చించాల్సి ఉంటుంది. ఏపీలో ఉచిత బస్సు పధకాన్ని సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికి నాలుగున్నర నెలలుగా ఏపీలో ఈ పథకం అమలు అవుతోంది. ఇక ప్రభుత్వానికి ఆర్థికంగా ఈ పధకం భారంగా మారింది.

ఏటా రెండు వేల కోట్లు :

ఏపీలో ఉచిత బస్సు పధకం కొనసాగాలీ అంటే ఏటా రెండు వేల కోట్ల రూపాయలు సర్కార్ ఖజానా నుంచి ఆర్టీసీకి కేటాయించాల్సిందే. ఈ పధకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో అమలు చేస్తున్నారు. దాంతో ఆయా బస్సులలో మొత్తం మహిళలు అంతా హాయిగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇవ్వడం ద్వారానే ఈ పధకాన్ని కొనసాగించాల్సి ఉంది. ఇప్పటికి రెండు విడతలుగా ఏకంగా 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పధకానికి మంజూరు చేసింది. గతంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మరో ఎనిమిది వందల కోట్లను లేటెస్ట్ గా రిలీజ్ చేసింది.

భారీ ఊరటగా :

ఈ నిధులు విడుదల కావడంతో ఆర్టీసీకి భారీ ఊరట కలిగింది. ఈ నిధులతో సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు మార్గం సుగమం అయింది. అలాగే డీజిల్ ఖర్చులకు కూడా ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇది రీయింబర్స్‌మెంట్ కింద లెక్క. ఆర్టీసీలో ప్రయాణీంచే ప్రతీ మహిళకు జీరో టికెట్ ని ఇస్తున్నారు. అలా డేటా కలెక్ట్ చేస్తున్నారు. దాంతో నెలలో ఎంత మంది ప్రయాణించారు. ఎంత ఖర్చు అవుతోంది అన్నది ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది. సుమారుగా చూస్తే ప్రతీ నెలలో రెండు వందల కోట్ల దాకా ఈ పధకం కింద మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఆ మొత్తాలని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించడం ద్వారా ఉచితానికి ఊపిరిపోస్తోంది.

ఉచితం ఫలితం :

అయితే ఒక వైపు రాష్ట్ర ఖజానా సహకరించకున్నా కూడా ఉచిత బస్సు పధకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ కాబట్టి కొనసాగిస్తోంది. మరి ఇంతలా పంటి బిగువున భరిస్తూ కొనసాగిస్తున్న ఈ పధకానికి ఆదరణ ఏ మేరకు ఉంది, ఫలితం ఎలా ఉంది అటే మిశ్రమ స్పందన వస్తోంది. మహిళలు ఉచితంగా ఈ పధకం కింద ప్రయాణం చేస్తున్నారు. అయితే వారు కూడా ఏమంత సంతోషంగా లేరని అంటున్నారు. దానికి కారణం ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బస్సులను ఆపడం లేదు, ఆపినా చాలా చోట్ల కండక్టర్లు విసుక్కుంటున్నారు అని ఫిర్యాదులు వస్తున్నాయి.

అదే సమయంలో మగవారికి సీట్లు లేకుండా చేస్తూ బస్సులు ఎక్కుతున్నారు. దాంతో మగవారు అంతా కూడా ఈ పధకం మా నెత్తి మీదకు వచ్చిందని మండిపడుతున్నారు. ఇక సమయానికి ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగినులు అయితే ప్రతీ బస్సు రష్ గా ఉండడంతో సమయానికి వెళ్లలేకపోతున్నారు. విద్యార్ధినుల పరిస్థితి అలాగే ఉంది. మొత్తంగా చూస్తే అమలులో ఈ పధకం బాలారిష్టాలను దాటలేదని అంటున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రూట్లలో బస్సులు ఎక్కువగా పెంచడం అలాగే ఆర్టీసీ బస్సులు తమ సొంతం అని భావించే కండక్టర్లు డ్రైవర్లు కొంతమంది ఉన్నారని వారికి సరిగ్గా క్లాస్ తీసుకోవడం ప్రతీ బస్ స్టాప్ లో కచ్చితంగా బస్సులు ఆగేలా చూడడం చేస్తే పధకం ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.