సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసుల పంపిన సీఐ శంకరయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సందర్భంలో పులివెందుల సీఐగా వ్యవహరించిన జె. శంకరయ్య తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు
By: Garuda Media | 24 Sept 2025 11:37 AM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సందర్భంలో పులివెందుల సీఐగా వ్యవహరించిన జె. శంకరయ్య తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా దురుద్దేవపూర్వకంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ.. తన న్యాయవాది ధరణేశ్వరరెడ్డి ద్వారా లీగల్ నోటీసులు ఫంపారు.
అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య సదరు నోటీసుల్లో పేర్కొనటం గమనార్హం. దీంతో సీఐ శంకరయ్య ఎవరు? ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపే వరకు వెళ్లటమా? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? వివేకా హత్య కేసులో ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివరాల్లోకి వెళితే..
2019 మార్చిలో వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా శంకరయ్య వ్యవహరించారు. ఆయన సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసంచేశారని.. రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను 2021 అక్టోబరు ఆరున ఎత్తేసింది.
అయితే.. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. వివేకా హత్య కేసులో సీబీఐకు వాంగ్మూలం ఇచ్చిన వారిలో శంకరయ్య కూడా ఒకరు. అప్పట్లో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని చూస్తే.. ‘‘వివేకా హత్యపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపించొద్దని.. ఆయన డెడ్ బాడీపై ఉన్న గాయాల గురించి ఎవరికీ చెప్పొద్దని నన్ను భయపెట్టారు’ అని చెప్పారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాన్ని నమోదు చేయటానికి మాత్రం ఆయన హాజురు కాలేదు. తనకు వేరే పనులు ఉన్నట్లుగా చెబుతూ దాటవేశారు
నిందితులు ఆయన్ను ప్రభావితం చేయట వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ కోర్టు ద్రష్టికి తీసుకొచ్చింది. కట్ చేస్తే.. తాజాగా అదే శంకరయ్య ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన కర్నూలు రేంజ్ లో వీఆర్ లో ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా ఒక ముఖ్యమంత్రికి.. ఒక పోలీసు అధికారి లీగల్ నోటీసులు ఇవ్వటం.. అందునా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరటం..పరువు నష్టం మొత్తాన్నిచెల్లించాలని అడగటం లాంటివి ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయని చెప్పక తప్పదు.
