Begin typing your search above and press return to search.

ఏపీ అంటే అప్పులేనా...అన్నీ గుదిబండలేనా ?

ఏపీ అంటే ఒకప్పుడు అన్న పూర్ణ అనేవారు. వ్యవసాయాధారిత రాష్ట్రం. భారీ ఉత్పత్తితో ఎగుమతులు జరిగి ఏపీ ఎంతో సుసంపన్నంగా ఉండేది.

By:  Satya P   |   9 Aug 2026 1:00 AM IST
ఏపీ అంటే అప్పులేనా...అన్నీ గుదిబండలేనా ?
X

ఏపీ అంటే ఒకప్పుడు అన్న పూర్ణ అనేవారు. వ్యవసాయాధారిత రాష్ట్రం. భారీ ఉత్పత్తితో ఎగుమతులు జరిగి ఏపీ ఎంతో సుసంపన్నంగా ఉండేది. విభజన జరిగాక ఏపీ ఏకంగా 90 వేల కోట్ల రెవిన్యూ లోటుతో ఏర్పాటు అయింది. ఆనాటి నుంచి ఏపీకి ఆర్ధిక ఇబ్బందులే అన్ని వైపుల నుంచి వెంట తరుముతున్నాయి. కొత్తగా రాజధాని నిర్మాణం నుంచి పారిశ్రామిక సేవా రంగాలుగా ఏపీని మార్చుకునే క్రమంలో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వస్తోంది. ఇక పోటా పోటీ రాజకీయంతో సంక్షేమ పధకాలు కూడా విరివిగా ఇవ్వాల్సి వస్తోంది. మరో వైపు ఖర్చులు అనేక రకాలుగా ఏపీని సతమతం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన ఆర్ధిక శ్వేత పత్రం చూస్తే ఏపీ ఎప్పటికి కోలుకుంటుంది అన్న సందేహం అయితే కలుగుతోంది.

ఏపీ ఆదాయం ఎంత :

ఇక చూస్తే ఏపీ ఆదాయం ఎంత అన్న చర్చ కూడా ఉందిపుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర తలసరి ఆదాయం 2025-26 నాటికి 2,94,507 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్‌డీపీ వృద్ధి రేటు గత రెండేళ్లలో 11.3 శాతానికి చేరింది. అలాగే రుణాల భారం చూస్తే జీఎస్‌డీపీతో రుణాల నిష్పత్తి 36.2 శాతానికి చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రకారం చూస్తే రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ. 2,17,977 కోట్లుగాను, రెవెన్యూ వ్యయం రూ. 2,51,163 కోట్లుగాను ఉంది. అంటే ఇక్కడ సుమారు రూ. 33,186 కోట్ల రెవెన్యూ లోటు కనిపించింది.

ఉద్యోగుల జీతాల లెక్క :

ఇక ఏపీలో అతి పెద్ద కేటాయింపుగా ఉద్యోగుల జీత భత్యాలు అలాగే ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్లు కూడా ఉన్నాయి. వీటి లెక్క చూస్తే కనుక మొత్తం రాష్ట్ర రెవిన్యూలో 98 శాతం దాకా ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోందని శ్వేత పత్రంలో పొందుపర్చారు. ఇక పక్కన ఉన్న కర్ణాటకలో మొత్తం రాష్ట్ర ఆదాయంలో ఉద్యోగుల జీత భత్యాలు 28 శాతం ఉంటే తెలంగాణలో 44 శాతం ఉంది. వాటితో పోలిస్తే ఏపీలోనే జీత భత్యాల కేటాయింపు మొత్తాలు అధికం అని ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక శ్వేత పత్రం తెలియచేస్తోంది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో :

ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంటే 2026-27 లో బడ్జెట్ వివరాలు చూస్తే అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 3,32,205 కోట్లు కాగా, రెవెన్యూ ఆదాయం రూ. 2,34,140 కోట్లు, రెవెన్యూ ఖర్చు రూ. 2,56,143 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల రూ. 22,002 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. అలాగే జీఎస్డీపీలో రూ. 75,868 కోట్లు అంటే సుమారు 3.84 శాతం మూలధన వ్యయంగా ఉంది. ఇది రూ. 53,915 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఏపీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం లక్ష్న్నర కోట్లుగా ఉంటే కేంద్రం నుంచి వచ్చే ఆదాయం మరో 40 వేల కోట్లుగా ఉంటోంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి ఈసారి బడ్జెట్ లో మూడు లక్షల 32,205 కోట్లుగా ఆదాయం చూపించారు.

సంక్షేమానికి సైతం :

ఏపీకి రెండేళ్ళలో సంక్షేమానికి లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి డెబ్బై అయిదు వేల కోట్లు అన్న మాట. ఇక అమరావతి రాజధానికి పోలవరం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అభివృద్ధి కోసం అని భావించాలి. అలాగే ఇతర పెట్టుబడుల కోసం వెచ్చించే ఖర్చు కూడా ఈ లెక్క కిందకే వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా చేసే ఖర్చు రెండు విధాలుగా ఉంటుంది. ప్రణాళికా వ్యయం అంటే అభివృద్ధి కోసం పెట్టేది. అది ఈ రోజు పెడితే రేపటికి ఆదాయంగా మారుతుంది. ప్రణాళికేతర వ్యయం అంటే సంక్షేమ పధకాలు ఇతర ఖర్చులు అన్న మాట. సంక్షేమం అన్నది రాజాయంగం ప్రవచించింది కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది. కానీ అది ఎంత ఏ మేరకు అన్నది ప్రభుతాలే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉచితాలు ఎపుడూ అనుచితాలు కాకూడదు అన్న ఆర్ధిక మూల సూత్రం కూడా ఉంది.

కఠినంగా ఉండాల్సిందే :

మొత్తం మీద చూస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.9.74 లక్షల కోట్ల కోట్లు అని టీడీపీ కూటమి చెబుతూంటే రెండేళ్ళ కూటమి ప్రభుత్వంలో అప్పులు అక్షరాలా మూడు లక్షల 60 వేల కోట్లు అని వైసీపీ అంటోంది. మరో మూడేళ్ళలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని కూడా వైసీపీ విమర్శిస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా ఏపీ అప్పుల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఆదాయానికి మించి అప్పులు చేస్తే ఊబిలో చిక్కుకున్నట్లే అవుతుంది. ప్రణాళికా వ్యయం అన్నది ఎపుడూ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉంటుంది అని అంటున్నారు. ఈ విషయంలో కాస్తా ఇబ్బందిగా ఉన్నా ఉచితాల మీద సంక్షేమ పధకాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏపీ లాంటి రాష్ట్రాలలో ఇది చాలా అనివార్యం అని అంటున్నారు.