చెట్టు-పుట్టే వేదికగా.. ఆ ఏపీ మంత్రి రాజకీయం.. !
వాస్తవానికి ఉరవ కొండలో ఎప్పుడూ స్థిరమైన రాజకీయాలు జరగడం లేదు. 2014లో వైసీపీ విజయం దక్కించుకుంది.
By: Garuda Media | 2 Dec 2025 2:00 PM ISTమంత్రులందరిదీ ఒక దారి అయితే.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ది మరో దారి. దీనికి కారణం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురంలోని ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఎన్నికలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ మార్పు జరగకుండా చూసుకునేందుకు మంత్రి పయ్యావుల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు ప్రజలనను కలుస్తున్నారు. వారి సమస్యలు వింటున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన సామాన్యులతో కలిసి పోయి..చెట్టు-పుట్టల కిందే కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీంతో మంత్రి అయినా.. ఆయన భేషజాలకు పోకుండా.. సామాన్యులతో కలిసి పోతున్నారన్నవాదన బలంగా వినిపించేలా చేస్తున్నారు. గత 17 మాసాల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కలియ దిరిగారు. ప్రతి సమస్యను ప్రత్యేకంగా పట్టించుకుంటున్నారు. మంత్రిగా ఉన్నా.. వీఐపీ ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టి పొలాల వెంబడి తిరుగుతూ..రైతులను పలకరిస్తున్నారు. ఇది.. మంచి ఇమేజే తెస్తోంది.
వాస్తవానికి ఉరవ కొండలో ఎప్పుడూ స్థిరమైన రాజకీయాలు జరగడం లేదు. 2014లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇక, 2019లో కేశవ్‌విజయం దక్కించుకున్నారు. అయితే.. 2024లో కూడా ఆయన తిరిగి గెలిచినా.. వచ్చే ఎన్నికలపై మాత్రం ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయన అలెర్ట్ అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయినప్పటికీ.. ఎక్కడా గ్రూపులు కట్టకుండా రాజకీయాలు ముందుకు తీసుకువెళ్తున్నారు. వాస్తవానికి ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన వారు మరుసటి ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం లేదన్న సెంటిమెంటు కూడా ఆయనను వెంటాడుతోంది.
గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా యనమల రామకృష్ణుడు.. వంటి వారు ఓడిపోయారు. ఇక, ఇప్పుడు కూడా అదే సెంటిమెంటు ఏమైనా ఉంటే.. పయ్యావులను వెంటాడుతుందన్న వాదన ఉంది. దీంతో మరింతగా అలెర్ట్ అవుతున్నారు. పార్టీ పరంగానే కాకుండా.. స్థానికంగా ప్రజలను కలుసుకునే విషయంలోనూ ఆయన డౌన్ టు ఎర్త్ అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇటు చంద్రబాబు దగ్గర మంచి మార్కులు వేయించుకుంటూ.. అటు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ.. మరోవైపు నియోజకవర్గంలో ప్రజలకు చేరువగా ఉంటూ.. క్షణం తీరిక లేకుండా పయ్యావుల పడుతున్న కష్టం వచ్చే ఎన్నికల్లో ఆయనకు విజయం అందిస్తుందనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
