Begin typing your search above and press return to search.

ఏపీలో సినిమా షూటింగులకు యాక్షన్ ప్లాన్

ఏపీలో గతంలో ఎన్నో షూటింగులు జరిగాయి. వరసబెట్టి తెలుగు తమిళ్ హిందీ భాషా చిత్రాలు షూటింగులు జరుపుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

By:  Satya P   |   16 Jun 2026 8:15 AM IST
ఏపీలో సినిమా షూటింగులకు యాక్షన్ ప్లాన్
X

ఏపీలో గతంలో ఎన్నో షూటింగులు జరిగాయి. వరసబెట్టి తెలుగు తమిళ్ హిందీ భాషా చిత్రాలు షూటింగులు జరుపుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఏపీలో విశాఖ రాజమండ్రిలలో లెక్కలేనన్ని సినిమా షూటింగులు జరిగిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఆ పాత రోజులు తీసుకుని రావాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. తాజాగా ఏపీ ఫిలిం టెలివిజన్ నాటకరంగ అభివృద్ది సంస్థ డైరెక్టర్ల తొలి సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ దిశగా కీలకమైన ఆలోచనలు చేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి బోర్డు సమావేశంలోనే అనేక అంశాలు చర్చించారు.

సమగ్ర అభివృద్ధికి :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు. . బోర్డు సమావేశానంతరం ఎక్స్రార్డినరీ జనరల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని చెప్పారు.

ప్రోత్సాహకాలకు ప్రతిపాదన :

ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణకు చిత్రీకరణకు అనుకూల వాతావరణం కల్పించడం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. అంతే కాకుండా గతంలో ప్రకటించిన నంది అవార్డులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన నంది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివిధ అంశాలు విధివిధానాలు, సూచనలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించామని అన్నారు.

చలనచిత్ర పరిశ్రమ మరింత బలోపేతం :

ఏపీలో చలనచిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేయడంతో పాటు కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ప్రోత్సాహం అందించేలా కార్పొరేషన్ కార్యాచరణ కొనసాగుతుందని సమావేశంలో పలువురు డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. ఏపీలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో మళ్ళీ షూటింగులు జరిగి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే అనేక మందికి అవకాశాలు పెద్ద ఎత్తున దక్కుతాయని కూడా చెబుతున్నారు.