పెళ్లి కాని ప్రసాదులు 40 దాటినా పెళ్లెందుకు అవ్వదో, పిల్లల్ని ఎందుకు కనలేరో తెలుసుకోరా!
ప్రస్తుత ఆధునిక సమాజంలో మారుతున్న జీవనశైలి, కెరీర్ ఆకాంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా సమాజంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి.
By: Sivaji Kontham | 23 Sept 2026 5:00 AM ISTప్రస్తుత ఆధునిక సమాజంలో మారుతున్న జీవనశైలి, కెరీర్ ఆకాంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా సమాజంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువతలో వివాహాలు భారీగా ఆలస్యం కావడం, సంతానంపై ఆసక్తి తగ్గడం వంటి పరిణామాలు జనాభా లెక్కలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు డబ్బే సర్వస్వంగా మారిపోయిన పరిస్థితుల్లో కేవలం ఆస్తులు, భారీ ప్యాకేజీలు, బంగ్లాలు, కార్ల కోసం వెతికే క్రమంలో చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటూ చివరకు 40 ఏళ్ల వయసు దాటినా ఒంటరిగానే మిగిలిపోతున్నారు.
ఇలాంటి ధోరణికి అద్దం పట్టేలా ఒక జిల్లాను ఏపీలో అధ్యయనం చేస్తే, షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం ఒక్క శ్రీకాకుళం జిల్లాలో గత ఐదేళ్లలో నమోదైన జననాల గణాంకాలను పరిశీలిస్తే ఎన్నో ఆందోళనకర నిజాలు స్పష్టమవుతున్నాయి. జిల్లాలో గత ఐదేళ్ల గణాంకాలను గమనిస్తే జననాల సంఖ్య క్రమేపీ పడిపోతున్నట్లు తెలుస్తోంది.
2021-22 సంవత్సరంలో జిల్లాలో 31,810 జననాలు నమోదయ్యాయి. 2022-23 సంవత్సరంలో ఈ సంఖ్య 31,193కి తగ్గింది. 2023-24 సంవత్సరంలో 31,970 మంది జన్మించారు. 2024-25 నాటికి జననాల సంఖ్య ఒక్కసారిగా 24,700కి పడిపోయింది. 2025-26 సంవత్సరంలో కేవలం 23,072 మంది మాత్రమే జన్మించారు. అంతేకాకుండా ఈ ఐదేళ్ల కాలంలో జన్మించినవారిలో బాలురు (72,904 మంది) కంటే బాలికల (69,966 మంది) సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
ఈ విధంగా జననాల రేటు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం యువతకు వివాహాలు ఆలస్యం కావడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్య, ఉద్యోగం ..జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో చాలామందికి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా పెళ్లిళ్లు కావడం లేదు. ఒకవేళ పెళ్లయినా కుటుంబ బాధ్యతలు, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా పిల్లలను కనేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. మరికొంతమందైతే కెరీర్ ధ్యాసలో పడి అసలు పిల్లలే వద్దనుకునే స్థాయికి చేరుకున్నారు. చిన్న కుటుంబమే మేలన్న భావన బలపడటం.. పెరిగిన విద్య, వైద్యం, ఇల్లు నిర్వహణ వంటి ఖర్చులు కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
ఈ పరిస్థితుల ప్రభావం రాష్ట్రంలోని ఫెర్టిలిటీ రేటు (TFR) పై స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మహిళ తన ప్రసవ వయసుల్లో సగటున కనబరిచే పిల్లల సంఖ్యను సూచించే టోటల్ ఫెర్టిలిటీ రేట్ గతంలో రెండు కంటే ఎక్కువగా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.4 నుంచి 1.5 మధ్యకు పడిపోయింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2021లో దేశంలో TFR 2.0గా ఉంటే.. ఏపీలో 1.7గా ఉండేది. ఇప్పుడు అది మరింత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు `చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం` అని ప్రచారం చేసిన ప్రభుత్వాలు.. నేడు జననాల రేటు పడిపోవడంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నాయి.
జననాల తగ్గుదల ఇదే విధంగా దీర్ఘకాలం కొనసాగితే సమాజంలో తీవ్రమైన సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరికలు వస్తున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగితే అది భవిష్యత్తులో ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ ధోరణిలో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో సమాజం పెద్ద ఎత్తున ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
