కూటమి సర్కార్: 'మెరుగుల' ముచ్చటలో.. మునుగుతున్న వాస్తవాలు.. !
ఉదాహరణకు రాష్ట్రంలో దాదాపు నాలుగు నుంచి ఐదు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆవేదన, తీవ్ర ఆందోళన, నిరసనలు, ధర్నాలతో రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నారు అన్నది వాస్తవం.
By: Garuda Media | 17 Sept 2025 12:00 AM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు పూర్తయ్యాయి. ఈ 15 మాసాల కాలంలో సుపరిపాలనను అందించామని సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పదేపదే చెబుతున్నారు. సరే ప్రభుత్వంలో ఉన్నవారు తమ పాలన బాగుందని చెప్పుకోవడం తప్పేమీ కాకపోయినా క్షేత్రస్థాయిలో వాస్తవాలను విస్మరిస్తున్నారు అన్న విమర్శలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఒకటి రెండు అనుకూల మీడియా సంస్థల్లో వచ్చే వార్తలు ప్రచారాలను మాత్రమే సీఎం చంద్రబాబు సహా మంత్రులు నమ్ముతున్నారన్న వాదనా వినిపిస్తోంది.
గతంలో కూడా ఇలానే వాస్తవ పరిస్థితులను గమనించకుండా కొన్ని మీడియా యాజమాన్యాలు చేసిన ప్రచారం, అనుకూల నాయకులు చేసిన ప్రచారంతో చంద్రబాబు బుట్టలో పడ్డారు. ఇది ఎన్నికల సమయానికి తీవ్ర వ్యతిరేకతగా మారి, ఆయన ఓటమికి కూడా దారితీసింది. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా సీఎం చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట.
ఉదాహరణకు రాష్ట్రంలో దాదాపు నాలుగు నుంచి ఐదు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆవేదన, తీవ్ర ఆందోళన, నిరసనలు, ధర్నాలతో రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నారు అన్నది వాస్తవం. పైకి ఇవి కనిపించకపోయినా అంతర్గతంగా జిల్లాల స్థాయిలో మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఉదాహరణకు రైతులకు యూరియా లభించక గిట్టుబాటు ధరలు లేక నానా అగచాట్లు పడుతున్నారు. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఇది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు యూరియా విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఎదురు దాడిని కూడా రైతులు సహించలేకపోతున్నారు.
రైతులను కొందరు నాయకులు బెదిరిస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. ఇక రెండో అంశం అంగన్వాడీలకు ఇస్తామని చెప్పిన జీతం పెంపు సహా ఇతర అలవెన్సులు, పెండింగ్ వేతనాలు వంటివి ఇబ్బందికరంగా మారాయి. పైకి ప్రభుత్వం ఈ విషయాన్ని సునిసితంగా తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంగన్వాడీ మహిళలు ఉద్యమిస్తున్నారు. ఇక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా రెండుసార్లు ఇప్పటికే మంత్రి లోకేష్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయటం.. పోలీసులు వారిపై లాఠీచార్జీలు చేయడం తెలిసిందే.
మరి ఇలా ఎందుకు జరుగుతుందన్నది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరో వైపు ఉరుముతున్న ఉప్పెనలాగా ఉద్యోగ సంఘాల నాయకులు కనిపిస్తున్నారు. తమకు రావాల్సిన పిఆర్సి బకాయిలు తమకు ఇవ్వాల్సిన వేతనాలు వంటివి పెండింగ్లో పెట్టడంతో పాటు ఇతర సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వారి ప్రధాన వాదన. అంతేకాదు ఎన్నికలకు ముందు ఇచ్చిన సిపిఎస్ రద్దు ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సూపర్ సెక్స్ సంక్షేమ కార్యక్రమాల నుంచి లబ్ధి పొందని వారు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అర్హత ఉండి కేవలం రాజకీయ పార్టీల నేపథ్యాన్ని చూసిన క్రమంలో తాము అర్హత కోల్పోయామని చెబుతున్న బాధితులు జిల్లా నుంచే వేలమంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే లక్షల్లో కనిపిస్తున్నారు. వీరందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల కలెక్టర్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఇలా రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు వర్గాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఆవేదన ఆందోళన నిరసనలు ధర్నాలతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ, పైకి మాత్రం సీఎం చంద్రబాబు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు అంతా బాగుందని భావిస్తున్నారు. అదే మాట చెబుతున్నారు. ఇలాంటివి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయి అంటే ఎన్నికల వరకు బాగానే ఉంటుంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సమస్యలను పరిష్కరించే దిశగా నిజాలను ఒప్పుకుని వాటిని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తే చెప్పుకున్నా చెప్పుకోకపోయినా సుపరిపాలన విషయంలో ప్రజలకు ఒక అవగాహన ఏర్పడుతుంది.
