ఫేకు-సాకు.. సర్కారుకు బ్రేకు.. !
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం తల పట్టుకుంటోంది. గత నెల రోజులుగా దీనిపై కసరత్తు కూడా చేస్తోంది.
By: Garuda Media | 6 Sept 2025 8:30 AM ISTఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం తల పట్టుకుంటోంది. గత నెల రోజులుగా దీనిపై కసరత్తు కూడా చేస్తోంది. ప్రభుత్వం ఎంతో మంచి చేస్తున్నా.. ప్రతిపక్షం, దానికి అనుకూలంగా ఉన్న మీడియాలు తమపై వ్యతిరేక ప్రచారాన్ని దంచికొడుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే `సేనతో సేనాని` కార్యక్రమంలో స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఫేక్ న్యూస్ ప్రచారానికి అడ్డుకట్ట పడేలా.. చట్టం చేస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం తాజాగా దృష్టి పెట్టింది.
అయితే.. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది. ప్రభుత్వం చెబుతున్న ఫేక్ న్యూస్ నిజంగానే ఫేకా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు వస్తాయి. అనేక ప్రభుత్వాలు.. ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏమీ అతీతం కాదు. ఉదాహరణకు గతంలో మామిడి పల్ప్ విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారు. గుంటూరులో పొగాకు రైతులు.. నానా తిప్పలు ఎదురకొన్నారు. ఆయా సందర్బాల్లో.. సోషల్ మీడియాలోనే కాకుండా.. ప్రధాన మీడియాల్లోనూ కథనాలు వచ్చాయి.
అయితే.. తొలుత వాటిని తిప్పికొట్టినా.. ప్రభుత్వం తర్వాత వాటిపై చర్యలు తీసుకుంది. కేంద్రానికి లేఖ లురాసింది. ఫలితంగా రైతులకు కొంత ఊరట లభించింది. అయితే.. ఇప్పుడు.. ఎరువుల వ్యవహారం కూడా.. ఇదే తరహాలో సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఎరువుల కోసం రైతులు క్యూ కట్టి .. నిద్రాహారాలు కూడా మానుకుని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. వీటిని ముందు తోసిపుచ్చినా.. తాజాగా ప్రభుత్వ అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున ఈ వార్తలు వచ్చాయి.
రైతులకు ఎరువులు యూరియా అందడం లేదని.. ఓ వర్గం నాయకులు అధికారులతో కుమ్మక్కయి.. ఎరు వులను దారిమళ్లించారని కధనాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు నిన్నటి వరకు ఫేక్ అన్న ప్రభుత్వమే.. వాటిపై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు ఏది ఫేక్ ? అనే ప్రశ్న వస్తే.. నిజంగానే ప్రజల్లో సమస్యలు ఉన్నాయ ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. వాటిని పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిని బట్టి.. ఫేక్ అనేది కాదు.. వాస్తవమే సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తోందని.. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వమే స్పందించాల్సి ఉంటుందన్నది స్పష్టమైంది.
