నకిలీ లిక్కర్: చేతిలో దీపం పెట్టుకుని `జోగి` ప్రమాణం!
ఏపీని గత కొన్నాళ్లుగా కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 27 Oct 2025 3:47 PM ISTఏపీని గత కొన్నాళ్లుగా కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు నకిలీ లిక్కర్‌ను తయారు చేయమని తనను ప్రోత్సహించిన వ్యక్తి జోగి రమేషేనని వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారుల ముందు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక, జనార్దన్‌రావు-జోగి కలిసి ఉన్న ఫొటోలు, వాట్సాప్ చాట్‌లు కూడా బయటకు వచ్చాయి.
దీంతో టీడీపీ సైడ్ నుంచి జోగి రమేష్‌పై విమర్శల పర్వం మొదలైంది. పోలీసులు కూడా ఆకోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గతంలోనే స్పందించిన జోగి రమేష్ తనకు లిక్కర్ కేసుకు సం బంధం లేదని చెప్పారు. అంతేకాదు.. జనార్దన్ తనకు తెలిసినా.. ఆయన వ్యాపారానికి, తన రాజకీయాల కు ఎక్కడా సంబంధం లేదన్నారు. కావాలంటే.. ఏ ప్రమాణానికైనా సిద్ధమని చెప్పారు. అవసరమైతే.. లై డికెక్టర్, నార్కో ఎనాలిసిస్ టెస్టులకు కూడా సిద్ధమేనన్నారు. దీనిపై ఇటీవల వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు.
ఈ క్రమంలో తాజాగా సోమవారం జోగి రమేష్ తన కుటుంబంతో సహా కలిసి విజయవాడ దుర్గమ్మ ఆలయా నికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డులో దిగి.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నడుచుకుంటూ పైకి వెళ్లారు. అక్కడే ఓ ప్రమిదలో దీపం వెలిగించి.. అరచేతిలో పెట్టుకుని.. నకిలీ లిక్కర్ కేసుకు.. తనకుఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. ``నన్ను, నా వ్యక్తిత్వాన్ని గాయపరిచారు. పరువును పోగొట్టారు. అందుకే ఈ ప్రమాణం చేస్తున్నా. నేను గతంలోనే చెప్పా. నాకు లిక్కర్‌కు ఎలాంటి సంబంధం లేదు. అందుకే ప్రమాణం చేశా. నాపై ఆరోపణలు చేసిన వారు ఎవరైనా.. వచ్చి.. నిజమని చెప్పగలరా?`` అని ప్రశ్నించారు. అనంతరం.. అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు.
విచారణ ముమ్మరం..
మరోవైపు.. ప్రస్తుతం సిట్ అదికారులు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్‌రావులను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ మద్యం ఎక్కెక్కడ విక్రయించారు? ఎలా తయారు చేశారు? వచ్చిన సొమ్ములు ఏం చేశారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. ప్రాథమికంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చిన లాభాల్లో వాటాలు వేసుకుని కొందరు నేతలకు( ఏపార్టీ అన్నది తెలియదు), అధికారులకు పంచినట్టు జనార్దన్‌రావు తెలిపారు. ఇక, నకిలీ మద్యాన్ని ఆదివారాల పూట.. బార్లకు విరివిగా సరఫరా చేసినట్టు వెల్లడించారు.
