లిక్కర్ స్కాం లో బిగ్ ట్విస్ట్... కర్త కర్మ క్రియ ఆ వైసీపీ నేత !
ఇక జోగి రమేష్ తన మనుషుల ద్వారా నకిలీ మధ్యం గురించి ఎక్సైజ్ విభాగానికి తెలియచేసి మరీ దాడులు చేయించారని అలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చారని జనార్ధన్ రావు ఆరోపించారు.
By: Satya P | 13 Oct 2025 9:35 PM ISTఏపీలో ప్రస్తుతం నకిలీ మద్యం స్కాం అన్నది రాజకీయంగా సంచలనం రేపుతోంది. వైసీపీ అయితే ఈ విషయంలో అధికార కూటమిని విమర్శిస్తోంది. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం లిక్కర్ స్కాం అన్నది బయటకు రాగానే ఎవరు ఏమిటి అన్నది ఆలోచించకుండా సొంత పార్టీ వారి మీదనే వేటు వేసి తన నిజాయతీ నిరూపించుకుంది. అదే సమయంలో లిక్కర్ స్కాం విషయంలో తెర వెనక ఎవరు ఉన్నారు, సూత్రధారులు ఎవరు పాత్ర ధారులు ఎవరు అన్నది కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కూపీ లాగేందుకు సిట్ ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా సిట్ ని ఏర్పాటు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం తన నిష్పాక్షికమైన విధానాన్ని చాటుకుంది.
సంచలన వీడియో :
ఇదిలా ఉంటే ఈ కేసులో మొదటి నుంచి టీడీపీ మీద విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీకి షాక్ ఇచ్చేలా ఒక సంచలన వీడియో బయటకు రావడం విశేషం. ఈ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలను బయటపెట్టిన నిందితుడు జనార్ధన్ రావు చెప్పిన విషయాలు ఇపుడు వైరల్ అవుతోంది. ఈ మొత్తం నకిలీ మద్యం కేసులో కర్త కర్మ క్రియ వైసీపీనే అని ఆయన తేల్చేశారు. అంతే కాదు మాజీ మంత్రి జోగి రమేష్ దీని వెనక ఉన్నారంటూ ఆయన మొత్తం వివరాలను కూడా వెలుగులోకి తీసుకుని వచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తాము నకికీ మధ్యం ఆపేశామని అయితే తిరిగి మొదలెట్టమని చెప్పిందే మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ అంటూ జనార్ధన్ రావు సంచలన విషయాలనే బయటపెట్టారు.
టీడీపీని భ్రష్టు పట్టించేందుకే :
ఏపీలో కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని సవరించడం, నాణ్యమైన మద్యాన్ని జనాలకు అందించడం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కాం మీద విచారణ జరిపించడం వంటి వాటి నేపధ్యంలోనే వైసీపీ స్కెచ్ వేసి మరీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికే ఈ విధంగా తనతో చేయించారంటూ జనార్ధన్ రావు వీడియో బైట్ లో చెప్పడం మొత్తం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ఫోన్ కాల్ చేసి మరీ :
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జోగి రమేష్ తనకు ఫోన్ చేసి నకిలీ మధ్యం తయారు చేయమని చెప్పారని ఆ వీడియోలో జనార్ధన్ రావు చెప్పారు ఇదంతా టీడీపీ సర్కార్ ని బదనాం చేసేందుకే అని అని కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇక ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలెట్టడానికి కూడా వెనక వైసీపీ వ్యూహాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తంబళ్లపల్లె అంటే చిత్తూరు జిల్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా. ఆ విధంగా నేరుగా సర్కార్ మీద బురద జల్లడానికే ఇలా పక్కా ప్లాన్ తో చేశారు అన్నది జనార్ధన్ రావు చెప్పిన మాట.
మొత్తం అక్కడ నుంచే :
అదే సమయంలో లిక్కర్ యంత్రాలను తీసుకుని రావడం తనకు ఆర్థికంగా సహాయం చేయడం అంతా అయ్యాక తనను ఆఫ్రికాలోని తన ఫ్రెండ్ దగ్గరకు పంపించడం ఇవన్నీ వైసీపీ నేత జోగి రమేష్ పధకం ప్రకారమే చేశారు అని జనర్ధన్ రావు చెప్పడం ఇపుడు సంచలనంగా మారింది. ఇక జోగి రమేష్ తన మనుషుల ద్వారా నకిలీ మధ్యం గురించి ఎక్సైజ్ విభాగానికి తెలియచేసి మరీ దాడులు చేయించారని అలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చారని జనార్ధన్ రావు ఆరోపించారు. అయితే టీడీపీ వారినే కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఇగ్రహీం పట్నానికి కల్తీ లిక్కర్ కధ మళ్ళించడంలోనూ ఆయన పాత్ర కీలకం అని చెప్పారు. అలా అక్కడ కూడా దాడులు చేయించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చిన మీదట తనకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి మరీ మోసం చేశారని అందుకే గుట్టు మొత్తం బయటపెట్టానని జనార్ధన్ రావు ఇచ్చిన వీడియో బైట్ లో ఉంది. తనకు జోగి రమేష్ తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం వల్లనే ఈ నకిలీ మద్యం ఉచ్చులోకి దిగాను అని నిందితుడు అంటున్నాడు.
వైసీపీకి ఇరకాటం :
ఇదిలా ఉంటే నకిలీ మద్యం కేసులో టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ ఏకంగా సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న ఆ పార్టీకి ఇపుడు తాజాగా వచ్చిన ఈ వీడియో బైట్ తో భారీ షాక్ తగిలింది అని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీ ఈ విషయంలో చేసిందాని కంటే ప్రభుత్వమే అంతా కట్టుదిట్టంగా వ్యవహరించి లిక్కర్ ని కల్తీ చేసిన వారిని కటకటాల వెనక్కి నెట్టింది. తానుగా సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అంతే కాదు నకిలీ మద్యం కనుగొనేందుకు ప్రత్యేక యాప్ ని కూడా రెడీ చేసింది. నకిలీ మద్యం మీద ఉక్కు పాదంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూంటే వైసీపీ మాత్రం నానా యాగీ చేస్తోంది అని తమ్ముళ్ళు అంటున్నారు. తీరా ఇపుడు చూస్తే కీలక వైసీపీ నేతనే దీని వెనక ఉన్నారు అన్నది వీడియో బైట్ సాక్షిగా బయటపడిన తరువాత ఇప్పుడేమంటారు అని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కాం జరిగింది అన్నది వైసీపీ హయాంలో అని ఐతే అది కాస్తా తమ మెడకు చుట్టాలని వైసీపీ చేసిన ఈ పాలిటిక్స్ అంతా బూమరాంగ్ అయిందని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ సోమవారం ఒక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లుగా ఈ వీడియో బయటకు వచ్చింది. దాంతో డిఫెన్స్ లో పడిన వైసీపీ ఏ విధంగా జవాబు చెబుతుంది అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.
