నకిలీ లిక్కర్: అడ్డంగా బుక్కయిన జోగి.. వాట్సాప్ ఆధారం ఇదే!
ఈ కేసును చంద్రబాబుపై తోసేసే వీలుందని కూడా జోగి చెప్పినట్టు తెలిపారు. ఆయన సొంత చిత్తూరులోనే దీనిని ప్రారంభించడం వెనుక జోగి ఉన్నారని అద్దేపల్లి వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 15 Oct 2025 5:20 PM ISTఏపీలో సంచలనంగా మారిన నకిలీ మద్యం కుంభకోణంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర కీలకమని.. ఆయన చెప్పడంతోనే తాము నకిలీ లిక్కర్ తయారీ ప్రారంభించామని ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సుదీర్ఘ సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. జోగి రమేష్ తమను ప్రోత్సహించారని.. తంబళ్లపల్లిలో కుటీరం ఏర్పాటు చేసిన నకిలీ మద్యాన్ని తయారు చేయాలని చెప్పారని అన్నారు. ఈ కేసును చంద్రబాబుపై తోసేసే వీలుందని కూడా జోగి చెప్పినట్టు తెలిపారు. ఆయన సొంత చిత్తూరులోనే దీనిని ప్రారంభించడం వెనుక జోగి ఉన్నారని అద్దేపల్లి వ్యాఖ్యానించారు.
ఈ సెల్ఫీ వీడియోసంచలనం సృష్టించింది. అయితే.. దీనిని తోసిపుచ్చిన జోగి రమేష్.. ఇదంతా నారా ఫ్యామిలీ ఆడుతున్న కుట్ర అని.. ప్రభుత్వంఉద్దేశ పూర్వకంగా తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తాను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమ న్నా రు. అంతేకాదు.. లైడిటెక్టర్ టెస్టుకు కూడా తాను రెడీయేనని చెప్పారు. మరోవైపు వైసీపీ నాయకులు కూడా అద్దేపల్లి చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని పేర్కొన్నారు. సోమవారం రోజు రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో సంచలన విషయం వెలుగు చూసింది. దీని ప్రకారం.. వాట్సాప్ వేదికగా అద్దేపల్లి - జోగిల మధ్య సాగిన సంభాషణ బయట పడింది.
తనకు కాల్ చేయాలని జనార్ధన్‌రావుకు జోగి రమేష్ మెసేజ్ చేశారు. అంతేకాదు.. తన ఇంటికి రావాలని తొలుత మెసేజ్ చేసిన జోగి రమేష్.. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావని అద్దేపల్లిని ప్రశ్నించారు. అంతేకాదు.. ఒకసారి ఫేస్‌టైమ్‌లో మాట్లాడాలని జనార్ధన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిని బట్టి జోగి ప్రత్యక్ష ప్రమేయం కనిపిస్తోందని ఈ కేసును విచారిస్తున్న పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్‌రావు.ఇప్పటికే రెండు సార్లు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. దీనిలో ఒకసారి జయచంద్రారెడ్డి(టీడీపీ నుంచి సస్పెండ్ అయిన).. ఇప్పుడు జోగి పేరును ఆయన చెప్పారు. ఈ రెండు కోణాల్లోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
