Begin typing your search above and press return to search.

సచివాలయ సిబ్బంది ఫేస్ చూపించాల్సిందే !

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసే లక్షా పాతిక వేల మంది సిబ్బంది పనితీరుని పూర్తిగా మధింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By:  Satya P   |   18 Jan 2026 9:27 AM IST
సచివాలయ సిబ్బంది ఫేస్ చూపించాల్సిందే !
X

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసే లక్షా పాతిక వేల మంది సిబ్బంది పనితీరుని పూర్తిగా మధింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తోంది. అలసత్వం నిర్లక్ష్యం ఉదాశీనత వంటివి ఎక్కడా లేకుండా రాకుండా చూసేందుకు గట్టి చర్యలను తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో సచివాలయ సిబ్బందికి షాక్ ఇచ్చేలా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది మాన్యువల్ గా హాజరు పట్టీతో ఇదివరకు జరిగినది అంతా గతం అని గుర్తు చేస్తూ ఇపుడు ఫేస్ రికగ్నిషన్ యాప్ ని ప్రవేశపెడుతోంది.

యాప్ లోనే హాజరు :

సచివాలయ సిబ్బంది ఎన్నింటికి వస్తున్నారు, ఎన్నింటి వరకూ ఉంటున్నారు, ఏమేమి విధులు నిర్వహిస్తున్నారు అన్నది కూడా ప్రత్యేకంగా మోనిటరింగ్ చేయనున్నారు. దాని కంటే ముందు ఆఫీసుకు వచ్చే సమయం వెళ్ళే సమయం ఈ రెండూ కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారానే జరగాలని కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది.

వెల్లువెత్తిన ఫిర్యాదులతో :

సచివాలయ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వారి మీద పర్యవేక్షణ పనితీరు విషయంలో మోనిటరింగ్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో చాలా మంది ఇది అలుసుగా తీసుకుని ఆఫీసులలో సరైన టైం లలో ఉండడం లేదు అని ఫిర్యాదులు ఉన్నాయి. సచివాలయాలతోనే పని చేయించాలని పధకాలు కానీ అభివృద్ధి కానీ ఏ పని అయినా అక్కడ నుంచే జరిపించాలని ప్రభుత్వం చూస్తున్న నేపధ్యంలో జనాలు ఎక్కీ గుమ్మం దిగీ గుమ్మంగా ఉందని సిబ్బంది అయితే టైం కి ఉండడం లేదని ఆరోపణలు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దాంతో ప్రభుత్వం ఇక మీదట కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

హాజరు అతి ముఖ్యం :

ఎవరైనా ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసుకోకపోతే దానిని క్రమశిక్షణ చర్యగానే భావిస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా ఆఫీసు వేళలను తప్పనిసరిగా పాటించాలని కూడా ఆదేశించారు. ఎవరైనా లేట్ గా వచ్చినా లేక విధులకు డుమ్మా కొట్టినా ఇక మీదట ఉపేక్షించేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఫీల్డ్ మీద వర్క్ ఉన్న వారికి ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ యాప్ నుంచి కొంత మినహాయింపు ఇచ్చినా రానున్న రోజులలో అందరూ కూడా యాప్ ని ఫాలో కావాల్సిందే అని ఆదేశిస్తున్నారు.

పర్యవేక్షణ పక్కా :

గ్రామాలలో అయితే పంచాయతీ స్థాయి అధికారులు వార్డులలో అయితే మున్సిపాలిటీ కార్పోరేషన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సచివాలయంలో సిబ్బంది పని తీరు వారి విధులను పూర్తిగా సమీక్షిస్తారు అని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పధకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఏ మాత్రం అలసత్వం లేకుండా చేసేలా కూడా చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు. ఈ యాప్ తో పాటు మోనిటరింగ్ సిస్టం ని అమలు చేయడం ద్వార గ్రామ వార్డు సచివాలయాలలో పనితీరుని మరింత సమర్ధంగా పారదర్శకంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని చెబుతున్నారు.