విద్యుత్ చార్జీల పై రగడ: కూటమికి లాభమెంత ..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించామని ప్రకటన చేసింది.
By: Garuda Media | 3 Oct 2025 1:00 AM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించామని ప్రకటన చేసింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సహా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కూడా ప్రకటించారు. యూనిట్ కు 13 పైసలు చొప్పున తగ్గిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక సీఎం చంద్రబాబు కూడా ప్రజలపై వైసీపీ ఒకప్పుడు భారం మోపితే ఇప్పుడు తాము తగ్గిస్తున్నామని చెప్పారు. నవంబరు ఒకటో తారీకు నుంచి విద్యుత్ చార్జీల భారం ప్రజలపై తగ్గుతుందని చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై వైసీపీ మరో కోణంలో ప్రచారం చేస్తోంది. విద్యుత్ చార్జీల తగ్గింపు వ్యవహారం కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందే తప్ప ఎప్పుడూ తగ్గించలేదని వైసిపి ఆరోపిస్తోంది. దీంతో ఇరుపక్షాలు కూడా విద్యుత్తు అంశంపై రాజకీయ వ్యూహాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఇప్పటికే వైసీపీ వాదన బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే ప్రజల మధ్యకు వెళ్లి విద్యుత్ చార్జీల అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించింది.
ఇదంతా ఒక అంశమైతే ..సోషల్ మీడియాలో మేధావులు విద్యుత్ రంగ నిపుణులు మరో వాదన చేస్తున్నారు. ఈ విషయంలో ఇరు పార్టీలకు సంబంధం లేదని.. ఇది విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) తీసుకున్న నిర్ణయం అని వారు చెబుతున్నారు. అటు వైసిపి పాలనలో అయినా ప్రస్తుతం కూటమి పాలనలో అయినా విద్యుత్ ఛార్జీలను పెంచేందుకే ప్రయత్నించారని, పెంచారని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు తగ్గిస్తున్న వ్యవహారంలో ఇరు పక్షాలకు ఎలాంటి పాత్ర లేదని అంటున్నారు. ఇది విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయమని వారు ఆధారాలతో సహా చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ విద్యుత్ ఛార్జిలో తగ్గింపు ప్రకటన ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం సంతృప్తి కనిపించడం లేదు. దీనికి కారణం యూనిటీగా 13 పైసలు చొప్పున మాత్రమే తగ్గించారు. అది కూడా నవంబరు నుంచి. అంటే ఉదాహరణకు 300 యూనిట్ల విద్యుత్తు కాల్చే ఒక కుటుంబానికి నెలకు తగ్గే అమౌంట్ కేవలం 32 రూపాయలు మాత్రమే. దీంతో ఇది పెద్దగా ఒరిగే కార్యక్రమం అయితే కాదని అంటున్నారు. కేవలం ఏదో కంటితుడుపు చర్య మాత్రమేనని మేధావులు నిపుణులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి దీనిపై యాగీ చేసుకునేందుకు బదులు విద్యుత్ చార్జీలను తగ్గించే ప్రయత్నంలో ఉండాలని చెబుతున్నారు.
