ఏపీలో 'విద్యుత్' సెగ.. వైసీపీ వర్సెస్ టీడీపీ!
ఏపీలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు కూడా కొన్నాళ్లుగా దీనినే కోరు కున్నారు.
By: Garuda Media | 30 Sept 2025 5:00 PM ISTఏపీలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు కూడా కొన్నాళ్లుగా దీనినే కోరు కున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా తాము అధికారంలోకి వస్తే.. విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని.. యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గిస్తున్నారని.. కూటమి మంత్రులు ప్రకటించారు. దీనినే తాజాగా చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. ఈ తగ్గింపు నవంబరు నెల బిల్లుల నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు.
అయితే.. ఆ వెంటనే వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ విషయానికి ప్రభుత్వానికి సంబంధం లేదని.. ఆధారాలతో సహా ప్రచారం చేపట్టింది. విద్యుత్ ధరల నియంత్రణ మండలి(ఈఆర్ సీ).. ఇచ్చిన 106 పేజీల జీవో కాపీని కూడా సోషల్ మీడియాలో తెరమీదికి తెచ్చింది. దీనిలో ఈఆర్‌సీ పేర్కొన్న కీలక విషయాలను ప్రస్తావించింది. దీని ప్రకారమే.. ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. దీనిలో సర్కారు పాత్ర కానీ.. సీఎం పాత్ర కానీ ఏమీలేదన్నది వైసీపీ చెబుతున్న మాట. పైగా.. వాస్తవానికి ప్రభుత్వం ఇంకా విద్యుత్ చార్జీలను పెంచాలని నిర్ణయించిందని బాంబు పేల్చింది.
ఈ పరిణామాలు.. ఇరు పార్టీల మధ్య తీవ్ర రాజకీయ సమరానికి దారితీశాయి. మీ హయంలోనే విద్యుత్ చార్జీలు పెంచారంటూ.. టీడీపీ నేతలు వైసీపీపై దుమ్మెత్తి పోశారు. ఇక, వైసీపీ కాదు కాదు.. మా హయాంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా చూశామని చెప్పుకొచ్చారు. బాబు వచ్చిన తర్వాత.. ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆరోపిస్తున్నా రు. ఈ క్రమంలోనే ఈఆర్ సీ కొరడా ఝళిపించిందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై ఇరు పక్షాలు కూడా.. ప్రజల మధ్యకు వెళ్లేందుకు రెడీ అయ్యాయి. వచ్చే నెల 5 నుంచి చంద్రబాబు దీనిపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. వైసీపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.
అసలు వాస్తవం ఏంటి?
1) వైసీపీ హయాంలోనే.. విద్యుత్ చార్జీలను పెంచారన్నది వాస్తవం.
2) తమకు వస్తున్న నష్టాలను ప్రభుత్వం భర్తీ చేయాలని విద్యుత్ సంస్థలు కోరాయి.
3) కానీ.. ట్రూ అప్(వాస్తవ చార్జీలకన్నా పైన) చార్జీల రూపంలో వసూలు చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం చెప్పింది.
4) దీంతో ప్రజల నుంచి గత 4 సంవత్సరాలుగా ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు.
5) కూటమి ప్రభుత్వంలో మరిన్ని చార్జీలు మోపారన్నది కూడా వాస్తవం.
6) అయితే.. ఈఆర్సీ చెప్పిన దానికంటే.. 2024-25 మధ్య ప్రజల నుంచి 935 కోట్ల రూపాయలను అదనంగా వసూలు చేశారు.
7) ఈ క్రమంలో ఆడిటింగ్ చేసిన ఈ ఆర్ సీ.. ఆ మొత్తాన్ని ప్రజలకు ఒకేసారి ఇచ్చేయాలని రెండు మాసాల కిందటే.. విద్యుత్ సంస్థలను కోరింది.
8) దీనిపై కంపెనీలు.. ఈఆర్సీలో వాదనలు వినిపించి.. ఇంత మొత్తం ఒకేసారి కుదరదని తేల్చి చెప్పడంతో ఈఆర్సీ.. వచ్చే నవంబరు నుంచి ఏడాది పాటు 13 పైసలు చొప్పున తగ్గించాలని ఆదేశించింది.
9) దీనిని అమలు చేయకపోతే.. ధిక్కారం కింద కేసులు పెట్టి జరిమానాలు విధించాల్సి వస్తుందని కూడా 106 పేజీల జీవోలో స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ సంస్థలు తగ్గించనున్నాయి.
10) ఇక, ఇటీవల జరిగిన అసెంబ్లీలోనే దీనిని చెప్పాలని అనుకున్నామని.. కానీ, చెప్పలేదని ప్రభుత్వం చెప్పింది.
11) ఇది కూడా తప్పే. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27న శనివారం ముగిశాయి. అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఆర్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో అసలు ఈ విషయం ఆదివారం ఉదయం వరకు వెలుగు చూడలేదు. సో.. ఇరు పక్షాలదీ ఈ విషయంలో సరైన వాదన కాదన్నది నిపుణులు చెబుతున్న మాట.
