Begin typing your search above and press return to search.

కూటమి సిద్ధం...జగన్ సిద్ధమేనా ?

అధికారంలో టీడీపీ కూటమి ఉంది. మూడు పార్టీలు కూడా కలసికట్టుగా ఉన్నాయి. తెలుగుదేశం క్షేత్ర స్థాయిలో అత్యంత బలంగా ఉంది.

By:  Satya P   |   23 Sept 2025 10:00 PM IST
కూటమి సిద్ధం...జగన్ సిద్ధమేనా ?
X

అధికారంలో టీడీపీ కూటమి ఉంది. మూడు పార్టీలు కూడా కలసికట్టుగా ఉన్నాయి. తెలుగుదేశం క్షేత్ర స్థాయిలో అత్యంత బలంగా ఉంది. ఇక జనసేన కూడా గోదావరి జిల్లాలతో పాటు కొన్ని చోట్ల గట్టిగానే ప్రభావం చూపించే స్థితిలో ఉంది. ఇక బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీ కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో తన రాజకీయ పరిస్థితులను మెరుగుపరచుకుంటోంది. ఈ మూడు పార్టీలకు మోడీ బాబు పవన్ ప్రజాకర్షణ కలిగిన నేతలుగా ఉన్నారు. దాంతో పాటు గత పదహారు నెలల పాలనలో అటు అభివృద్ధి మరో వైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికి అయితే ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత ఏదీ లేదు సరికదా సానుకూలత అనేక అంశాలలో ఉంది.

ఆ వేడిలోనే అంతా :

ఈ క్రమంలో టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమకు ప్రజలలో ఇపుడు మంచి పాజిటివిటీ ఉందని గుడ్ గవర్నెన్స్ అన్న పేరు కూడా ఉందని ఈ వేడిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించుకుంటే పూర్తిగా స్వీప్ చేయవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. మొదట మూడు నెలలు ముందుగానే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేశారు. మునిసిపాలిటీలు, కార్పోరేషనల్లో ఎన్నికలు పెట్టాలని కూడా అనుకున్నారు. అయితే చాలా చోట్ల అవిశ్వాసంతో కొత్తగా కూటమి పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి. దాంతో వారి పదవీ కాలం పూర్తిగా కొనసాగించాలన్న విన్నపాలు వచ్చాయి దాంతో షెడ్యూల్ ప్రకారామే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు అని అంటున్నారు.

రెడీ అన్న లోకేష్ :

తాజాగా మంత్రి నారా లోకేష్ ఇదే విషయం మీద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు తాము ఎపుడూ సిద్ధమని ప్రకటించారు. కూటమి సర్వ సన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అయితే పదవీ కాలం పూర్తి అయిన తరువాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. దాంతో కూటమి స్థానిక ఎన్నికలకు తనదైన వ్యూహాలతో అన్ని విధాలుగా సిద్ధమైపోతున్నట్లు గానే ఉంది అని అంటున్నారు.

వైసీపీ మాటేంటి :

స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది అని అంటున్నారు. పవర్ కూడా సర్కార్ కి ఉండడం అదనపు బలంగా ఉంటే మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు రావడం మరో ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన బంపర్ విక్టరీని రిపీట్ చేయాలని కూటమి చూస్తోంది. మరి వైసీపీ మాటేంటి అన్న చర్చ అయితే వస్తోంది. 2024 ఎన్నికల్లో అన్ని విధాలుగా దెబ్బ తిన్న వైసీపీకి స్థానిక ఎన్నికలు ఒక విధంగా ఆశాకిరణంగానే చూడాల్సి ఉంటుంది. ఎంతో కొంత మార్పు రాజకీయంగా ఉంటే దాంతో కోలుకునే వీలు ఉంటుంది.

అయితే స్థానిక ఎన్నికల విషయంలో విపక్షంగా వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్నదే చర్చగా ఉంది. ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వైసీపీకి ఈ ఎన్నికలు మరో అవకాశంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి గట్టిగా గురి పెడితేనే ఆశావహమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఆ విధంగా వైసీపీ తయారుగా ఉందా అన్నదే చర్చ. మేము సిద్ధమని కూటమి వైపు నుంచి గట్టిగా సౌండ్ వినిపిస్తూంటే వైసీపీ వైపు నుంచి కూడా ధీటుగా బదులు రావాల్సి ఉంది. మరి ఆ దిశగా వైసీపీ అడుగులు పడుతున్నాయా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.