'ఆన్లైన్ నామినేషన్లు' తెస్తే సమస్య తీరినట్లే..! నెట్టింట హాట్ టాపిక్
స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసను అరికట్టడానికి ఆన్లైన్ నామినేషన్ విధానం ఒక గొప్ప డిజిటల్ సంస్కరణగా అభివర్ణిస్తున్నారు.
By: Tupaki Political Desk | 22 Oct 2026 8:00 PM ISTఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై విస్తృత చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల సమయంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితే నెలకొంటుందని, అయినప్పటికీ హింసను నిరోధించేలా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలంటే నామినేషన్ల ప్రక్రియను ఆన్ లైన్ చేయాలనే ప్రతిపాదనపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందర్భంగా దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడం, ఈ విషయంపై విపక్షం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో నామినేషన్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్ ఎక్కువ అవుతోందని అంటున్నారు.
ఎన్నికల నామినేషన్లను ఆన్లైన్లో స్వీకరించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ప్రతి పని ఆన్ లైన్ లో జరిగిపోతోందని, ఎన్నికల ప్రక్రియ మాత్రమే ఇంకా భౌతిక విధానంలో కొనసాగుతుందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వైరి వర్గాలు ఒకేసారి నామినేషన్ కేంద్రాలకు రావడం వల్ల గొడవలు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. అదే ఆన్ లైన్ లో నామినేషన్ సమర్పించే వెసులుబాటు ఉంటే 99 శాతం ఉద్రికత్తలను నియంత్రించవచ్చునని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మొదలుకొని విశ్వవిద్యాలయాల ప్రవేశాల వరకు ప్రతి ముఖ్యమైన ప్రక్రియ డిజిటల్‌గా సాగుతున్నప్పుడు, ఎన్నికల నామినేషన్లను కూడా ఆన్లైన్ ఎందుకు చేయకూడదనేది నెటిజన్ల ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులు డిజిటల్‌గా పత్రాలు అప్లోడ్ చేయడం, డిజిటల్ సంతకాలతో అప్లై చేసుకోవడం ద్వారా నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులపై దాడులు చేయడం లేదా నామినేషన్ సెంటర్ల వద్ద గొడవలు సృష్టించడం వంటి దుశ్చర్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం 'సువిధ' పోర్టల్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఇటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసను అరికట్టడానికి ఆన్లైన్ నామినేషన్ విధానం ఒక గొప్ప డిజిటల్ సంస్కరణగా అభివర్ణిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శక మార్పునకు నాంది పలికేందుకు ఈ ప్రతిపాదనను పరిశీలించాల్సిన తక్షణ అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటు వేసే హక్కు ఎంత ముఖ్యమో, పోటీ చేసే హక్కు కూడా అంతే ప్రాథమికమైనదని, భయాందోళనలు లేని వాతావరణంలో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా చూడటం ఎన్నికల సంఘం బాధ్యతగా వ్యాఖ్యానిస్తున్నారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుని ఆన్లైన్ నామినేషన్లకు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తే, రాజకీయం పేరిట జరిగే భౌతిక దాడులకు శాశ్వతంగా స్వస్తి చెప్పవచ్చని ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేస్తున్నారు.
