పెండింగ్ లో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు.. ఆ వివరాలు ఇవే.. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
By: Tupaki Political Desk | 14 Oct 2026 4:25 PM ISTరాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపాలిటీలకు ఈ రోజే (అక్టోబరు 14)న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, 100 చోట్ల మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. మిగిలిన పట్టణ సంస్థల ఎన్నికల విషయంలో కోర్టుల్లో కేసుల ఉన్నందున పెండింగులో పెట్టినట్లు ప్రకటించారు. కోర్టు తీర్పు వచ్చిన అనంతరం ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించారు.
రాష్ట్రంలో వంద పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలు అవుతుందని కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరు 16 నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28న ఎన్నికలు, 30న ఫలితాల విడుదల ఉంటుంది. ఇక రెండో విడతలో జడ్పీలు, మండల పరిషత్ లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. విశాఖ, విజయవాడ వంటి ప్రధాన కార్పొరేషన్లతోపాటు మొత్తం 13 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లి-మంగళగిరి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు ఈ విడతలో జరగడం లేదని చెబుతున్నారు. అదేవిధంగా మరో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు పెండింగులో పెట్టినట్లు సమాచారం.
ఇక రెండో విడతలో జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించనుండగా, ఈ పదవులకు ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. వచ్చేనెల 3న పోలింగ్, 5న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. మొత్తం 28 జిల్లా పరిషత్తులకు వాటి పరిధిలో మండల పరిషత్, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషనర్ పునేఠా ప్రకటించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియగానే నవంబరు 13న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతోంది. ఇది తొలి విడత కాగా, ఆ తర్వాత మరో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తారు. రెండో విడతకు నవంబరు 16, మూడో విడతకు నవంబరు 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నవంబరు 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో వరుసగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ బాక్సుల కొరత కారణంగా ఈ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తున్నట్లుగా ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
ఇక పండుగే.. పండుగ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలకు సైరన్ మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే హడావుడి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుండటం వల్ల దాదాపు ప్రతి గ్రామంలోనూ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇప్పటికే బలసమీకరణకు సర్వం సిద్దం చేసుకున్న నేతలు ఇక ప్రచార పర్వంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నవారు. ఇక ఎన్నికలలో పోటీకి అందరికీ సమాన అవకాశం కల్పించేలా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో నో డ్యూస్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతిపక్షం వైసీపీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్లైందని అంటున్నారు.
