ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే గెలిచేది ఎవరంటే ?
ఏపీ ఎన్నికలు ఎపుడూ ఆసక్తిని పెంచుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నంత రాజకీయ వేడి బహుశా తెలంగాణాలో కూడా ఉండదు, ఏపీలో రాజకీయాలు ఆ స్థాయిలో సాగుతాయి.
By: Satya P | 31 Jan 2026 1:00 AM ISTఏపీ ఎన్నికలు ఎపుడూ ఆసక్తిని పెంచుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నంత రాజకీయ వేడి బహుశా తెలంగాణాలో కూడా ఉండదు, ఏపీలో రాజకీయాలు ఆ స్థాయిలో సాగుతాయి. ఇదిలా ఉంటే ఎపుడు ఎన్నికలు జరిగినా తాము అధికారంలోకి వచ్చి తీరుతామని వైసీపీ ఈ మధ్య తరచూ చెబుతూ వస్తోంది. అయితే తాజగా వచ్చిన ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఏపీలో గెలిచేది వారే అంటూ ఇచ్చిన ఈ సర్వే ఫలితాలు ఏపీలో మరోసారి రాజకీయ చర్చకు తావిస్తున్నాయి.
కూటమికి వ్యతిరేకత ఉందా :
ఏపీలో 2024 జూన్ లో పదవీ బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వం మరి కొద్ది నెలలలో రెండేళ్ళ టెర్మ్ ని పూర్తి చేసుకోబోతోంది. అంటే మొత్తం అధికారంలో ఒక ముఖ్య భాగం పూర్తి అయినట్లే. మరి కూటమి పట్ల ప్రజలలో వ్యతిరేకత గట్టిగా ఉందని వైసీపీ అయితే ప్రచారం చేస్తూ వస్తోంది. కూటమి పని అయిపోయింది అని కూడా అంటోంది. కానీ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మాత్రం తనదైన శైలిలో నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే మరోసారి ఏపీలో కూటమి పాలన వస్తుందని విస్పష్టంగా తేల్చేసింది.
జై కొట్టిన జనం :
ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే కనుక టీడీపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఈ సర్వే తేటతెల్లం చేస్తోంది. ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అయితే ఏపీలో జనాలు కూటమి మోజులోనే ఉన్నారని కచ్చితంగా కూటమికే జై కొడుతున్నారని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ని బయటపెట్టింది. పైగా 2024 ఎన్నికల్లో కంటే కూడా తన ఓటు షేర్ ని పెంచుకుంటుందని లెక్క చెబుతోంది. గత ఎన్నికల్లో 53 శాతం ఓటు షేర్ వస్తే ఈసారి అది కాస్తా 55 శాతంగా ఎగబాకుతుందని పేర్కొంది.
ఎంపీ సీట్లు పెరుగుతాయి :
ఇక 2024 ఎన్నికల్లో కూటమికి 21 ఎంపీ సీట్లు వస్తే వైసీపీకి 4 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పటికి ఇపుడు ఎన్నికలు జరిగితే కూటమికే 22 నుంచి ఏకంగా 24 దాకా ఎంపీ సీట్లు లభిస్తాయని చెబుతోంది. అంటే ఒకే ఒక్క సీటు వైసీపీకి రావచ్చు అన్నట్లుగా ఈ సర్వే చెబుతోంది అన్న మాట. అంతే కాదు మరో ముఖ్యమైన మ్యాటర్ ఏంటి అంటే గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 40 శాతం ఓట్ షేర్ కాస్తా 39కి తగ్గిపోతుందని తేల్చింది. అంటే ఒక్క శాతం తగ్గితే మూడు ఎంపీ సీట్లు కూడా చేజారుతాయని ఈ సర్వే లోతైన విశ్లేషణ చేసింది అన్న మాట. ఇంకో వైపు చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు ఇతర పార్టీలు గతానికి కంటే ఈసారి తమ బలాన్ని ఏకంగా అయిదారు శాతం ఓటు షేర్ గా ఉమ్మడిగా దక్కించుకుంటాయని చెబుతోంది.
వైసీపీకి ఇబ్బందికరంగా :
దేశవ్యాప్తంగా ఎన్డీయే గ్రాఫ్ పెరుగుతోంది అన్నది ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. అందులో భాగంగా ఏపీలోనూ ఆ గాలులు బలంగా వీస్తాయని అంటోంది. దాంతో వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. ఈసారి గద్దెనెక్కేది తామేనని వైసీపీ ఆలోచనలు చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచనలు ఆ విధంగా లేవని ఏపీ జనాల మూడ్ ఇలా ఉందని చెబుతున్న ఈ సర్వేని జాగ్రత్తగా వైసీపీ అధ్యయనం చేయడం ద్వారా తన విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
