Begin typing your search above and press return to search.

లోకేష్ మరో సంచలన నిర్ణయం.. నెక్ట్స్ డీఎస్సీకి డేట్ ఫిక్స్

యువనేత, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Political Desk   |   10 Oct 2025 10:39 AM IST
లోకేష్ మరో సంచలన నిర్ణయం.. నెక్ట్స్ డీఎస్సీకి డేట్ ఫిక్స్
X

యువనేత, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పినట్లే ఏటా డీఎస్సీ నిర్వహణకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెనువెంటనే మరో డీఎస్సీపై మంత్రి లోకేశ్ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఉంటుందని తాజా నిర్ణయంతో మరోసారి రుజువైందని అంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన కోసం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేకుండా చూడాలని మంత్రి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీ అయిన మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి వదిలేయకుండా, నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఆశించే టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్ వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సన్నాహకంగా వచ్చేనెలలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని సూచించారు. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మార్చిలో పరీక్షలు నిర్వహించాలని, ఆ తర్వాత వచ్చే సంవత్సరం ప్రారంభమైన వెంటనే కొత్త టీచర్లు విధుల్లో చేరేలా చూడాలని మంత్రి లోకేశ్ అధికారులకు స్పష్టం చేశారు.

మంత్రి ఆదేశాలతో వచ్చే ఏడాది కూటమి ప్రభుత్వం రెండో డీఎస్సీ నిర్వహణకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒక డీఎస్సీ ద్వారా 16 వేల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది ఎన్ని పోస్టులకు డీఎస్సీ నిర్వహిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. అదేసమయంలో ప్రతి ఏటా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో పరీక్షల నిర్వహణ ఉండే అవకావం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా లోకేశ్ నిర్ణయం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు మరో అవకాశంగా చెప్పొచ్చు. గత ఐదేళ్లలో ఒక డీఎస్సీ కూడా లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ఖాళీగా సమయం గడపాల్సివచ్చింది.

మెగా డీఎస్సీని 150 రోజుల్లోనే పూర్తి చేసిన ప్రభుత్వం నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించింది. అంతేకాకుండా గత డీఎస్సీలో త్రుటిలో అవకాశం కోల్పోయిన

నిరుద్యోగులు వచ్చే డీఎస్సీకి మరింత ఉత్సాహంతో ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా కల్పించినట్లైంది. నిరుద్యోగుల్లో ఏ మాత్రం నిరుత్సాహం కలగకుండా వెంటవెంటనే డీఎస్సీలు నిర్వహించడం ప్రభుత్వంపై సానుకూలత పెంచుతుందని కూడా అంటున్నారు.