Begin typing your search above and press return to search.

ఏపీలో.. `డ‌బుల్ ఇంజ‌న్‌`కు ట్ర‌బుల్ వ‌స్తోందా ..!

ఏపీలో బిజెపి- జనసేన- టిడిపి కూటమి ప్రభుత్వం డ‌బుల్ ఇంజ‌న్ సర్కార్ తో దూసుకుపోతోంద‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు.

By:  Garuda Media   |   9 Sept 2025 2:00 PM IST
ఏపీలో.. `డ‌బుల్ ఇంజ‌న్‌`కు ట్ర‌బుల్ వ‌స్తోందా ..!
X

ఏపీలో బిజెపి- జనసేన- టిడిపి కూటమి ప్రభుత్వం డ‌బుల్ ఇంజ‌న్ సర్కార్ తో దూసుకుపోతోంద‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని గమనిస్తే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజ‌న్‌ సర్కార్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తెచ్చుకుంటున్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వెనుకబడింది అన్నది ప్రధానంగా వస్తున్న విమర్శ.

ఈ విషయాన్ని పక్కన పెడితే, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఈ విషయం ఇప్పటివరకు తేల్చలేకపోయారు. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాకారాన్ని ప్రైవేటీకరించే విషయంపై ఇక్కడి నాయకులు ఒక మాట చెప్తుంటే.. కేంద్రంలో ఉన్న నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా సరైన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నది ప్రధాన విమర్శ.

మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు, అమరావతికి సంబంధించిన నిధులు.. అప్పుల రూపంలో ఇప్పించడం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి కూటమిలో ఉన్నప్పుడు డబ్బులు ఇంజన్ సర్కారుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నప్పటికీ వాటిని విస్మరించి కొన్ని మాత్రమే చేపట్టి కన్నీళ్లు తుడుస్తున్న చందంగా మారింది అన్నది కమ్యూనిస్టుల నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటిని పరిహరించకపోతే కూటమి సర్కారుకు పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదన్నది వీరి మాట.

ముఖ్యంగా సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కేవలం 400 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టును మాత్రమే ఏపీకే కేటాయించింది. దీనిపై కూడా వివక్ష చూపిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణకు చెందిన కొందరు నాయకులు మాట్లాడుతూ.. ఏపీకి కేవలం చిన్నచిన్న ప్రాజెక్టులు మాత్రమే ఇస్తున్నారని కూటమిలో ఉండి ఏం సాధించినట్టని ప్రశ్నించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో డబ్బులు ఇంజన్ సర్కారు అని పైకి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఇది ట్రబుల్ ఇంజన్ సర్కార్ గా మారుతుందనే మాట వినిపిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి కేంద్రంతో చర్చించాల్సి ఉంది. కేంద్రం నుంచి రావలసిన నిధులను ప్రాజెక్టులను వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్ర వినిపిస్తుండడం విశేషం.