పవన్ చెప్పిన.. 'యోగి ట్రీట్‌మెంట్' ఏంటో తెలుసా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాజాగా వైసీపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 21 Dec 2025 11:58 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాజాగా వైసీపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీపీ విధానంలో వైద్య కాలేజీలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విధానంలో కాంట్రాక్టు దక్కించుకున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు మాసాల్లోనే జైలుకు పంపిస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్ కీలక కామెంట్లు చేశారు. ``పద్ధతిగా లేకపోతే.. యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది`` అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్‌మెంట్ అంటే ఏంటనేది.. సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న యోగి ఆదిత్యనాథ్ సన్యాసి. ఆయన బీజేపీ తరఫున గతంలో ఎంపీగా కూడా విజయం దక్కించుకున్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. బీజేపీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు ఉన్న సన్యాసిని తొలిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. యోగి సీఎం బాధ్యతలు చేపట్టే సరికి యూపీలో భారీ ఎత్తున `గూండా రాజ్` నడుస్తోంది. అదేసమయంలో లిక్కర్ నుంచి డ్రగ్స్ వరకు పెద్ద మాఫియా చోటు చేసుకుంది.
వీరితో పాటు.. భూకబ్జాలు.. ఆక్రమణలు, అమాయకులపై దాడులు.. రాజకీయ ప్రతీకార హత్యలు, సోషల్ మీడియాలో వివాదా స్పద పోస్టులు వంటివి పెచ్చరిల్లాయి. ఇక, శాంతి భద్రతల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. వీటిని సవాల్‌గా తీసుకున్న యోగి.. `పాయింట్ -5` ఫార్ములాను అవలంభించారు. ఐదు సూత్రాలతో పాలనను పరుగులు పెట్టించారు. ఇదేసమయంలో గూండాలకు, రౌడీలకు.. చెక్ పెట్టారు. ఆక్రమణలు, దాడులు చేసేవారికి తక్షణమే బుద్ధి చెప్పే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇలా.. దేశంలో తొలిసారి.. `బుల్డోజర్ పాలన`కు ఆయన శ్రీకారం చుట్టారు.
రౌడీలను ఏరి పారేసేందుకు..అనధికార బహిరంగ శిక్షలు అమలు చేశారు. రౌడీలు, గూండాయిజం చేసేవారిని ఉక్కుపాదంతో అణిచేశారు. పోలీసులు నడిరోడ్డుపై చితకబాదిన సంఘలు కోకొల్లలు. ఇక,రౌడీలకు సంబంధించిన ఆస్తులను బుల్‌డోజర్లతో కూలగొట్టారు. ఇది వివాదాస్పదమే అయినా.. కోర్టుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా.. యోగి వెనక్కి తగ్గలేదు. ఫలితంగా రౌడీయిజం ప్రస్తుత అంచనాల ప్రకారం.. 2 శాతానికి తగ్గింది. ఇక, రాజకీయ బెదిరింపులకు ఎక్కడా తలొగ్గలేదు. ఆచితూచి మాట్లాడితే సరే.. అలా కాకుండా.. నోరు చేసుకుంటే.. నడిరోడ్డుపైనే సదరు నేతలకు పోలీసులు దేహశుద్ధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా జిల్లాల్లో మాఫియాను అడ్డుకునేందుకు నిరంతర నిఘా పెట్టారు. పోలీసింగ్‌ను పటిష్ఠం చేశారు. సోషల్ మీడియాలో అవాకులు, చవాకులు పేలే వారిని ఉపేక్షించకుండా కేసులు కట్టి.. స్టేషన్లలో కూర్చోబెట్టారు. రాజకీయ రౌడీలకు.. ముకుతాడు వేశారు. ఒకప్పుడు.. గూండా గిరీకి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్న అనేక జిల్లాలలో మార్పులు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఇళ్లను కూల్చేయడం ద్వారా.. కుటుంబాలకు కుటుంబాలు మార్పు దిశగా అడుగులు వేసేలా చేశారు. మరోవైపు.. సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇది యోగి పాలనకు కలిసి వచ్చింది. సామాన్యులు సైతం మెచ్చేలా చేసింది. సో.. మొత్తానికి యోగి.. ట్రీట్‌మెంటు శాంతిభద్రతల విషయంలో బాగానే పనిచేసింది. ప్రత్యర్థులు నోరు అదుపులో పెట్టుకునేలా కూడా కాయకల్ప చికిత్స చేసింది.
