Begin typing your search above and press return to search.

ఆ రెండు శాఖ‌ల‌పైనే చంద్ర‌బాబు అసంతృప్తి.. ఏం జ‌రిగింది.. ?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయం తెలుసుకుంది.

By:  Garuda Media   |   24 Oct 2025 4:00 AM IST
ఆ రెండు శాఖ‌ల‌పైనే చంద్ర‌బాబు అసంతృప్తి.. ఏం జ‌రిగింది.. ?
X

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయం తెలుసుకుంది. ఏ ఏ శాఖల విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఏ ఏ శాఖలపై అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయాలపై సీఎం చంద్రబాబు ఆర్టిజిఎస్ ద్వారా అదేవిధంగా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని శాఖలపై 90 శాతం, మరికొన్ని శాఖలపై 80% ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అయింది. ఇలాంటి వాటిలో ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ అదేవిధంగా నీటిపారుదల శాఖ మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ ముందు వరసలో ఉన్నాయి.

పట్టణాభివృద్ధి శాఖలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక జల వనరుల శాఖపై రైతుల్లో 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం అయింది. ఇక సంక్షేమ శాఖకు సంబంధించి ఏకంగా 75 నుంచి 80% మధ్యలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ప్రభుత్వానికి నివేదికలు అదేవిధంగా సమాచారం అందింది. రెండు శాఖల విషయంలో మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది ప్రభుత్వానికి అందిన సమాచారం. వీటిలో ఒకటి హోం శాఖ, రెండు రెవిన్యూ శాఖ. ఈ రెండు శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన విషయం అందరికీ తెలిసిందే.

రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. కాబట్టి శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే శాఖగా హోంశాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖ రెవెన్యూ. కానీ ఈ రెండు శాఖల విషయంలోనే రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది తాజాగా ప్రభుత్వానికి అందిన సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు పోలీసుల వ్యవహరిస్తున్న తీరు వంటివి ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైకోర్టు కూడా పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

దీనిపై ప్రజలు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. కేవలం 40 నుంచి 45 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం. ఇక, రెవెన్యూ శాఖ విషయంలో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారి వారి భూములు కుదవ పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రెండు శాఖల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అన్నది వాస్తవం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల సంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పదేపదే మంత్రులకు అధికారులకు స్పష్టం చేశారు. మరి ముందు ముందు ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.