మోషేన్‌రాజుపై అవిశ్వాసం.. స్కెచ్ అంతా రెడీ అవుతోందా..?
సభకు రాజీనామా చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్సీల వ్యవహారాన్ని ఆయన తేల్చడం లేదు.
By: Garuda Media | 25 Jan 2026 8:00 AM ISTశాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఆ పదవి నుంచి తప్పించనున్నారా? ఆయన వ్యవహార శైలిపై ప్రభుత్వం సహా పాలక పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారా? అంటే.. ఔననే చర్చే జరుగుతోంది. సభకు రాజీనామా చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్సీల వ్యవహారాన్ని ఆయన తేల్చడం లేదు. వీరిలో కమ్మ నుంచి బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. వారి విషయాన్ని తేలిస్తే.. వారిని కలుపుకొని మండలిలో తమ బలం పెంచుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది.
కానీ, నెలలు గడుస్తున్నా.. మండలి చైర్మన్ తన విధానాన్ని, పద్ధతిని కూడా వదులుకోవడం లేదు. దీంతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మోషేన్ రాజును ఆ పదవి నుంచి దింపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో మండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం మండలిలో కూటమికి చాలినంత వరకు.. సంఖ్యాబలం ఉంది. ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్సీను తమవైపు తిప్పుకోగలిగితే.. మంత్రులతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యులు, నామినేటెడ్ సహా.. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు .. తమకు మద్దతు ఇస్తారని కూటమి భావిస్తోంది. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి.. ఆమోదించుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. దీనిపై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నా.. ఇప్పుడు కార్యాచరణ వరకు వచ్చిందని తెలిసింది.
ఇక, మండలి సభ్యుడిగా 2022లో వైసీపీ తరఫున నామినేట్ అయిన మోషేన్ రాజు.. పదవీ కాలం మరో రెండేళ్ల వరకు ఉంది. కానీ. అప్పటి వరకు వేచి చూస్తే.. ఇప్పటికే రాజీనామా చేసిన వారు త్రిశంకు స్వర్గంలో ఉన్న నేపథ్యంలో వారి నుంచి కూటమి పార్టీలపై ఒత్తిడి పెరిగింది. దీంతో అవిశ్వాసం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, మోషేన్‌రాజు ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఆయనను కదలిస్తే.. ఆ వర్గంలో వచ్చే రియాక్షన్ ఏంటి? దీనిని ఎలా తట్టుకుని ముందుకు సాగాలి? అనే విషయంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
