ఏపీ మండలి ఛైర్మన్ ను రూ.10వేలు చెల్లించాలని హైకోర్టు ఎందుకు చెప్పింది?
ఒక కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన వైనం ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 17 Sept 2025 11:07 AM ISTఒక కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఏపీ మండలి ఛైర్మన్ విషయంలో కోర్టు వినూత్న రీతిలో స్పందించింది. ఒక కేసులో కౌంటర్ దాఖలు కోసం అదే పనిగా సమయాన్ని అడుగుతున్న వేళ.. ఆ విన్నపాన్ని మన్నించేందుకు రూ.10వేలు ఖర్చు చేసి పుస్తకాలు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఏపీ మండలి ఛైర్మన్ విన్నపంపై హైకోర్టు ఎందుకలా రియాక్టు అయ్యింది? ఇంతకూ అదేం కేసు? అన్న వివరాల్లోకి వెళితే..
ఎమ్మెలసీ పదవికి రాజీనామా చేస్తూ జయ మంగళ వెంకటరమణ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖను అందించారు. దానిపై మండలి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. దీంతో.. ఈ అంశంపై జయ మంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మండలి ఛైర్మన్ తరఫు లాయర్ స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేసేందుకు తగిన సమయం కావాలని కోరారు. అందుకు అనుమతించారు.
తాజాగా మంగళవారం మరోసారి ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఛైర్మన్ తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కౌంటర్ వేసేందుకు తమకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కేసు స్వభావాన్ని పరిగణలోకి తీసుకొని మరికొంత సమయం ఇవ్వలేమని చెప్పారు. ఈ ఉదంతంలో రూ.10 వేలు ఖర్చులు భరించే షరతుతో కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు హైకోర్టు ఓకే చెప్పింది.
సదరు రూ.10 వేలను బుధవారం సాయంత్రం లోపు ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి పేరున జమ చేయాలని హైకోర్టు పేర్కొంది. ఆ డబ్బుతో లాబుక్స్ ను కొనుగోలు చేసి న్యాయవాదుల సంఘం లైబ్రరీలో ఉంచాలని అధ్యక్షుడిని ఆదేశించింది. తిరిగి. ఈ కేసు విచారణను ఈ నెల 19కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చిన నేపథ్యంలో మండలి ఛైర్మన్ ఈసారి ఎలా రియాక్టు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
