Begin typing your search above and press return to search.

విశాఖ విజయవాడ.... హీటెక్కించే రిజల్ట్స్ !

ఏపీలో మొత్తం 13 కార్పోరేషన్లకు నవంబర్ 1న పోలింగ్ జరగబోతోంది.

By:  Satya P   |   31 Oct 2026 1:00 AM IST
విశాఖ విజయవాడ.... హీటెక్కించే రిజల్ట్స్ !
X

ఏపీలో మొత్తం 13 కార్పోరేషన్లకు నవంబర్ 1న పోలింగ్ జరగబోతోంది. అందులో ఉత్తరాంధ్రా గోదావరి కోస్తా రాయలసీమ జిల్లాలలో కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నవి రెండే కార్పోరేషన్లు అని అంటున్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఏపీలో అతి పెద్ద కార్పొరేషన్ గా విశాఖ ఉంది. 120 వార్డులు అంటే ఏపీలో మరెక్కడా లేవు. అలాగే టాప్ టెన్ కార్పోరేషన్లలో దేశంలో ఒకటిగా జీవీఎంసీ ఉంది. ఆదాయంలో అభివృద్ధిలో అలాగే ఏపీలో మెగా సిటీగా విశాఖ ఉంది. విశాఖ మీద ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. దాంతో విశాఖను గెలుచుకోవాలని పట్టుదలతో రాజకీయ పక్షాలు చూస్తాయి. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే విశాఖ ఒక సెంటిమెంట్ గా ఉంది. 1987లో తొలిసారి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినపుడు టీడీపీ మేయర్ సీటుని గెలుచుకుంది. అది జరిగిన తరువాత దాదాపు నాలుగు దశాబ్దాల టీడీపీ విశాఖ మేయర్ పీఠం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అందుకే ఈసారి కూటమి పార్టీలు కోరినా ఇవ్వకుండా తానే పోటీ పడుతోంది.

ఎపుడూ భిన్నంగానే :

విశాఖ ఓటర్లు ఎప్పుడూ భిన్నంగా తీర్పు ఇస్తారు. వారు అభివృద్ధిని కోరుకుంటారు. దానితో పాటు ప్రశాంతత ఈ ప్రాంతం స్పెషాలిటీ. అందుకే రాజకీయ పక్షాలు కూడా ఇక్కడ సాఫీగానే ప్రచారం చేస్తూ వస్తాయి. టీడీపీ కూటమికి అయితే తమకు మేయర్ పీఠం కచ్చితంగా దక్కుతుందని నమ్మకం ఉంది. పైగా జీవీఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూటమికి చెందిన వారే. దాంతో గెలుపు నల్లేరు మీద నడక అని భావిస్తున్నా ఎక్కడా తగ్గడం లేదు, ఎందుకంటే ప్రజా క్షేత్రంలో పోరు ఎప్పటికప్పుడు వెరైటీగానే ఉంటుంది. పైగా 18 లక్షల ఓటర్లు ఓటు వేయబోతున్నారు. 2024 తరువాత కొత్త ఓటర్లు, జెన్ జీలు ఉన్నారు.

వైసీపీ గట్టిగానే :

వైసీపీ కూడా విశాఖ మేయర్ సీటు విషయంలో గట్టిగానే పోటీ పడుతోంది. తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అభ్యర్థి విషయంలో వైసీపీ సక్సెస్ అయింది. ఎమ్మెల్సీగా ఉన్న వరుదు కళ్యాణిని నిలబెట్టి జనానికి పరిచయం ఉన్న బీసీ మహిళతో రాజకీయంగా ముందుకు సాగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మీద వచ్చే యాంటీ ఇంకెంబెన్సీ మీదనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అలాగే కూటమిలో లుకలుకలు ఉంటే అవి తమకు ఎంతో కొంత అనుకూలిస్తాయేమో అన్నది కూడా వైసీపీలో ఎక్కడో ఉంది అని అంటున్నారు. దాంతో తీర్పు విషయంలో ఉత్కంఠ ఉంది అంటున్నారు.

వంగవీటి బ్రాండ్ తో :

ఇక విజయవాడ మీద అందరి చూపు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తే మరో తీర్పుగా దీనిని చూడాలి. పుష్కర కాలం తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో వంగవీటి రాధాక్రిష్ణ మేయర్ సీటుకు పోటీగా ఉన్నారు. ఆయన జనసేన నుంచి బరిలో ఉండడం రాజకీయంగా సామాజికపరంగా మరో ఆసక్తిని పెంచే పరిణామం. అలాగే వంగవీటి బ్రాండ్ పొలిటికల్ గా ఎపుడూ గట్టిగానే పనిచేస్తుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని కూటమి నమ్మకంగా ఉంది. టీడీపీ జనసేన కలసికట్టుగా బరిలోకి దిగుతోంది కాబట్టి రిజల్ట్ ఇక్కడ రీ సౌండ్ చేస్తుంది అంటున్నారు.

ఏబీవీ ఎంట్రీతో :

ఇక వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పోటీకి దిగారు. బీసీ ఓటు తో వైసీపీ ఇక్కడ ట్రంప్ కార్డునే వాడుతోంది. బీసీలు వలస వచ్చి నివాసం ఉంటున్న వారు మైనారిటీలు తమ వైపు అని వైసీపీ భావిస్తోంది. ఇక మేయర్ గా అయిదేళ్ళు పనిచేసిన భాగ్యలక్ష్మి అందరికీ తెలిసిన వారుగా ఉంటారు కాబట్టి ప్లస్ అవుతుందని ఊహిస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీతోనే అసలు ఇంట్రెస్ట్ మొదలైంది. ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన ప్రభావం ఎంత ఉంటుంది, ఏ మేరకు ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. అలాగే ఆయన తీసుకునే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయి అన్నది మరో చర్చ. ఆయన ఎంట్రీతో వైసీపీ నష్టపోతుంది అని ఒక విశ్లేషణ ఉంటే టీడీపీకి కొంత ఇబ్బంది అని మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా విజయవాడ అంటే రాజకీయ రాజధాని, ఇక్కడ మేయర్ అంటే నగర ప్రథమ పౌరుడు. అందువల్ల ఈ ఎన్నిక మీద ఏపీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలా ఏపీలో విశాఖ విజయవాడ ఎన్నికల ఫలితాలు అయితే హీటెక్కించబోతున్నాయని అంటున్నారు.