Begin typing your search above and press return to search.

ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు... పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ!

ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే పదో తరగతి పాసైనవారికి మాత్రమే పరిమితం అన్నట్టు ఉండేది.

By:  A.N.Kumar   |   2 Aug 2025 5:15 PM IST
ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు... పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ!
X

ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే పదో తరగతి పాసైనవారికి మాత్రమే పరిమితం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉన్నత చదువులు చదివిన ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు సైతం ఈ ఉద్యోగాల కోసం ఆసక్తిగా పోటీ పడుతున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగాలపై ఉన్న నమ్మకాన్ని, ఉద్యోగ భద్రత, మెరుగైన ప్రమోషన్ల పట్ల ఉన్న ఆసక్తిని సూచిస్తోంది.

ఉన్నత విద్యార్హతలున్నవారు కానిస్టేబుల్స్‌గా ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల 6,024 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో వెల్లడైన గణాంకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీలు (B.Tech) , మాస్టర్స్ (M.Tech) చదువుకున్న 810 మంది ఈ పోస్టులకు ఎంపికయ్యారు. అలాగే B.Sc చదివినవారు 1,805 మంది, M.Sc పూర్తి చేసినవారు 114 మంది ఉన్నారు.

అంతేకాకుండా న్యాయశాస్త్రం (LLB) చదివిన ఇద్దరు విద్యార్థులు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం విశేషం. ఇక B.Com చదివినవారు 645 మంది, BA చేసినవారు 484 మంది ఈ పోస్టులను పొందారు.

ఈ గణాంకాలను బట్టి చూస్తే, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా, సామాజిక సేవ, ప్రభుత్వంలో భాగం కావాలనే ఆకాంక్ష కూడా పెరిగిందని అర్థమవుతోంది. ఇదే సమయంలో మార్కెట్లో అసలు ఉద్యోగాలు లేకపోవడం.. కాంపిటేషన్ ఎక్కువ కావడం.. ఉద్యోగాల కొరత దృష్ట్యానే ఎక్కువ చదువులు చదివిన వారు కూడా ఇలాంటి చిన్న ఉద్యోగాలకు పోటీపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

పోలీస్ వ్యవస్థలో సామాజిక మార్పు

ఉన్నత విద్యావంతులు పోలీస్ కానిస్టేబుల్స్‌గా రావడం వల్ల వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయని ఆశించవచ్చు. విద్య, విజ్ఞానం ఉన్నవారు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో మరింత సమర్థవంతంగా మమేకం కాగలుగుతారు. సామాజిక స్పృహ, నైతిక విలువలతో కూడిన సేవలను ప్రజలకు అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.

ఒకప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కేవలం ఒక సాధారణ ఉద్యోగంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగ భద్రత, మంచి వేతనం, ప్రమోషన్ అవకాశాల దృష్ట్యా ఈ ఉద్యోగానికి గౌరవం పెరిగింది. ఈ మార్పు పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రజలకు మరింత చేరువ చేసేలా చేస్తుంది. రానున్న కాలంలో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.