Begin typing your search above and press return to search.

షర్మిల భవితవ్యం...కాంగ్రెస్ నిర్ణయం ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నారు.

By:  Satya P   |   20 July 2026 12:58 AM IST
షర్మిల భవితవ్యం...కాంగ్రెస్ నిర్ణయం ?
X

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నారు. ఆమె 2024 జనవరి మూడవ వారంలో ఈ పదవిని అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ని పెంచకపోయినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని చీల్చి సొంత పార్టీ పెట్టుకుని దెబ్బ తీసిన వైసీపీని గద్దె దించడంతో మాత్రం ఆమె నాయకత్వం సక్సెస్ అయింది. అదే సమయంలో వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేయడంలో షర్మిల పాత్ర రాయలసీమ జిల్లాలలో ముఖ్యంగా సాగింది. మొత్తానికి షర్మిల పీసీసీ చీఫ్ గా సాధించింది చూస్తే ఇదంతా విశ్లేషించాలి. ఆ మీదట గడచిన రెండేళ్ళుగా కూటమి ప్రభుత్వం మీద షర్మిల పోరాటం అయితే పెద్దగా లేదని విమర్శలు వచ్చాయి.

వైసీపీనే టార్గెట్ :

ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూనే షర్మిల తన రాజకీయం అంతా చేస్తూ వచ్చారు అన్న విమర్శలను మూటగట్టుకున్నారు. పైపెచ్చు కాంగ్రెస్ ఎక్కడా ఎత్తిగిల్లలేకపోయిని అని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ గద్దె దిగిపోతే అందులో నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అంతా కాంగ్రెస్ లో చేరుతారు అని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి వెనక్కి వస్తుందని వేసుకున్న అంచనాలు కూడా తల్లకిందులు అయ్యాయని అంటున్నారు. వైసీపీ తన బలాన్ని అలాగే ఉంచుకుంది. ఈ రోజుకీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి పోరాటం చేస్తోంది అని అంటున్నారు.

మౌనంగానే ఉంటూ :

ఈ క్రమంలో గత కొంతకాలంగా చూస్తే షర్మిల మౌనంగా ఉంటూ వస్తున్నారు. దానికి కారణాలు చూస్తే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారు అన్న ఆగ్రహం ఆమెలో ఉందని అంటున్నారు. కర్ణాటక నుంచి ఇటీవల నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో ఒకటి షర్మిలకే అనుకున్నారు. ఆ మేరకు దాదాపుగా ఖరారు అయిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ చివరికి చూస్తే ఆమె పేరు లేకుండా జాబితా వెలువడింది. దాంతో షర్మిల అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. దాంతో ఆమె సైలెంట్ మోడ్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు.

ఇది కూడా కారణమా :

ఇంకో వైపు చూస్తే ఏపీసీసీకి కొత్త నేతను తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తి కావడంతోనే ఏపీ మీద కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఫోకస్ పెడుతుందని అంటున్నారు. రానున్న మూడేళ్ళలో ఏపీలో అసెంబ్లీకి అలాగే లోక్ సభకు ఎన్నికలు ఉన్నందువల్ల ఇప్పటి నుంచే నాయకత్వాన్ని సరిచేసి లైన్ లో పెట్టాలని కాంగ్రెస్ అగ్ర నేతలు నిర్ణయించారు అని అంటున్నారు. ఇక షర్మిలకు ఎక్కడ పదవి ఇస్తారు అన్న చర్చ కూడా ఉంది. ఆమెని జాతీయ స్థాయిలోకి తీసుకుని పదవి ఇస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలోనే షర్మిల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే షర్మిల ఏపీ రాజకీయాలకు దూరం అవుతారా అంటే జవాబు తెలియడానికి మరి కొద్ది నెలలు వేచి చూడాల్సి ఉంది అని అంటున్నారు.