పాపం షర్మిల.. ఇంత హర్ట్ అవుతారనుకోలేదా ..?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల విషయంలో తీవ్రంగానే హర్ట్ అయి నట్టు ఉన్నారు.
By: Garuda Media | 4 Nov 2026 6:31 PM ISTఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల విషయంలో తీవ్రంగానే హర్ట్ అయి నట్టు ఉన్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా.. ఒకటి రెండు చోట్ల కూడా.. గెలుపు గుర్రం ఎక్కుతారని అనుకున్నా.. అందరూ చతికిల పడ్డారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకచోట మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి 240 ఓట్లు తెచ్చుకున్నారు. మరో చోట 20 నుంచి 50 ఓట్ల మధ్య మాత్రమే దక్కాయి. ఈ పరిణామాలు సహజంగానే జీర్ణించుకోలేక పోయారు షర్మిల.
దీంతో కూటమి సర్కారుపై తీవ్రస్థాయిలో ఆక్రోశించారు. ''ఓట్లు మీరే వేసుకున్నారు.. గెలుపు మీదేనని ప్రకటించు కున్నారు. ఇంకా ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి ? ఎన్నికల్లో పారదర్శకత అనేదానికి విలువేంటి ? స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనేదానికి అర్థం ఏంటి ?'' అని ఎక్స్‌లో సుదీర్ఘపోస్టు పెట్టారు. అంతేకాదు.. ఇది ప్రజా తీర్పు కాదని తేల్చేశారు. కూటమి పార్టీల నిజమైన జయభేరి కాదని,. ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి, సాధించిన బలవంతపు గెలుపగా షర్మిల అభివర్ణించారు.
షర్మిల చేసిందేంటి?
వాస్తవానికి ఇప్పుడు కూటమిపై విమర్శలు చేస్తున్న షర్మిల.. కీలక ఎన్నికల సమయంలో ఏం చేశారన్నది ప్రశ్న. ఎన్నికల వేళ కుమార్తె వివాహం ఉందన్న కారణంగా.. అసలు అభ్యర్థుల ఎంపికపైనే ఆమె దృష్టి పెట్టలేదు. అంతేకాదు.. అసలు ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ఆమె వ్యవహరించారు. కనీసం క్షేత్ర స్థాయిలో కూటమి బలాబలాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న మద్దతు ఎంత? ఎవరిని నిలిపితే.. గెలుస్తారు? అనే ముఖ్యమైన నాలుగు పాయింట్లను కూడా ఆమె పట్టించుకోలేక పోవడం గమనార్హం.
ఎవరికి వారే..
షర్మిల దాదాపు కాడి పడేయడంతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిం చారు. ఎక్కడికక్కడ నాయకులు ఇష్టానుసారంగానే వ్యవహరించారు. ప్రజలను కలుసుకున్నది.. వారిని తమ వైపు తిప్పుకొన్నది కూడా లేదు. దీంతో కాంగ్రెస్‌కు-ప్రజలకు మధ్య దూరం పెరిగిపోయింది. మరోవైపు.. కీలక ఎన్నికల సమయంలోనే సోదరుడు జగన్‌తో జగడం పెట్టుకోవడం.. బెంగళూరు ప్యాలెస్‌ను తన కుమార్తె వివాహానికి ఇవ్వడం లేదన్న విషయాన్ని భారీ ఎత్తున హైలెట్ చేయడంతో ఇది కూడా.. షర్మిల రాజకీయాలపై మరకలు పడేలా చేసిందన్న వాదన ఉంది.
ఈ నేపథ్యంలోనే ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ ను మరిచిపోయారు. ఇలా సంస్థాగతంగా, వ్యక్తిగతంగా అనేక లోపాలు పెట్టుకుని.. వాటిని సరిచేసుకునేందుకు కూడా దృష్టి పెట్టని షర్మిల.. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పునకు పెడార్థాలు తీయడంలో ఔచిత్యం ఏంటన్నది కూటమిలోని కొందరు నాయకులు అడుగుతున్న ప్రశ్న. ముందు సొంత ఇంటిని చక్క బెట్టుకుని ప్రజల మెప్పు పొందాలని కొందరు సూచిస్తున్నారు.
