Begin typing your search above and press return to search.

వైసీపీతో పొత్తు.. కామ్రేడ్ల త‌హ‌త‌హ‌.. !

కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా సీపీఐ కూడా మార్పులు చేసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు వైసీపీతో పొత్తులు చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

By:  Garuda Media   |   28 Oct 2025 1:00 AM IST
వైసీపీతో పొత్తు.. కామ్రేడ్ల త‌హ‌త‌హ‌.. !
X

ఇది నిజ‌మే!. ఏపీలోని క‌మ్యూనిస్టుల చూపు.. ఇప్పుడు వైసీపీపై ప‌డింది. ముఖ్యంగా సీపీఎం ఎలానూ.. వైసీపీకి తెర‌చాటున మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్న‌వాద‌న ఉంది. గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో సీపీఎం నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.. బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం.. అప్ప‌టి ప్ర‌భుత్వంపై ప‌న్నెత్తు విమ‌ర్శ కూడా చేయ‌క‌పోవ‌డం ప్ర‌స్తావ‌నార్హం. అప్ప‌టి సీపీఎం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ధు సూద‌న్‌రెడ్డి(మ‌ధు అని మార్చుకున్నారు) జ‌గ‌న్ దూర‌పు బంధువు అవుతార‌ని అంటారు.

ఆయ‌న అనారోగ్యానికి గురైన‌ప్పుడు సీఎంగా ఉన్న జ‌గ‌న్‌.. స్వ‌యంగా ఇంటికి కూడా వెళ్లి ప‌రామ‌ర్శించా రు. ఆ త‌ర్వాత‌.. ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌కు దీటుగా సీపీఎం ప‌త్రిక‌కు స‌ర్కారు నుంచి యాడ్లు కూడా అందాయి. అంతేకాదు.. జిల్లాల్లోనే కాకుండా.. మండ‌ల‌స్థాయిలో పార్టీ కార్యాల‌యాల ఏర్పాటుకు కూడా వైసీపీ ప్ర‌భు త్వం భూములు కేటాయించింది. ఇలా.. తెర‌చాటు బంధాన్ని సీపీఎం-వైసీపీలు కొన‌సాగించాయ‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగించింది. ఇదేస‌మ‌యంలో సీపీఐ అప్ప‌ట్లో డిస్టెన్స్ పాటించింది.

కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా సీపీఐ కూడా మార్పులు చేసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు వైసీపీతో పొత్తులు చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎంపిక‌లోనే ఈ మార్పు క‌నిపించింద‌న్న చ‌ర్చ ఉంది. క‌డ‌ప జిల్లా(జ‌గ‌న్ సొంత జిల్లా)కు చెందిన గుజ్జ‌ల ఈశ్వ‌రయ్య‌కు సీపీఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టును ఇవ్వ‌డం వెనుక‌.. పొత్తులే కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా కామ్రెడ్ల మ‌ధ్య వినిపిస్తోంది.

అంతేకాదు.. గ‌తంలో కొంత మేర‌కు వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించినా.. ఇప్పుడు దానికి ప‌దింత‌లుగా.. కూట‌మి స‌ర్కారుపై సీపీఐ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అంతేకాదు.. వైసీపీ చేప‌ట్టిన మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లోనూ క‌మ్యూనిస్టులు అప్ర‌క‌టితంగా పాల్గొన్నారు. అధికారికంగా కూడా.. రాబోయే రోజుల్లో వైసీపీతో క‌లిసి ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై పోరు సాగిస్తామ‌ని.. నాయ‌కులు చెబుతున్నా రు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కామ్రెడ్లు.. వైసీపీతో పొత్తుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రు కాబ‌ట్టి ఏదైనా జ‌ర‌గొచ్చు.