2025 @ ఏపీ పాలిటిక్స్ : రెప రెపలు తగ్గిన ఎర్ర జెండా ..!
ఎర్రజెండెర్రజెండెన్నీయల్లో.. అంటూ.. ప్రజల సమస్యలపై ఒకప్పుడు బలమైన గళం వినిపించిన కమ్యూనిస్టు నేతలకు ఈ ఏడాది కూడా పెద్దగా మార్కులు పడలేదన్నది వాస్తవం
By: Garuda Media | 30 Dec 2025 8:45 AM ISTఎర్రజెండెర్రజెండెన్నీయల్లో.. అంటూ.. ప్రజల సమస్యలపై ఒకప్పుడు బలమైన గళం వినిపించిన కమ్యూనిస్టు నేతలకు ఈ ఏడాది కూడా పెద్దగా మార్కులు పడలేదన్నది వాస్తవం. వైసీపీ హయాంలో 5 సంవత్స రాలు.. మైనస్‌లలో సాగిన కమ్యూనిస్టుల ప్రభావం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొంత పుంజు కుంది. అయితే.. 2014-19 మధ్య ఉన్న దూకుడు కానీ.. ప్రజలకు చేరువ అయ్యే విధానాలను కానీ.. కమ్యూనిస్టులు.. తర్వాత కాలంలో ఒడిసి పట్టుకోలేక పోయారు.
సీపీఎం విషయానికి వస్తే.. వైసీపీ హయాంలో నోరు కూడా విప్పలేదు. ఇక, కూటమి సర్కారు వచ్చాక.. మీడి యా ముందుకురావడం ప్రారంభమైంది. బీవీ రాఘవులు, వీ శ్రీనివాసరావు తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. కానీ, కమ్యూనిస్టుల బలమైన గళం ప్రజల్లోకి వస్తే తప్ప.. వినిపించదన్న విషయం తెలిసిందే. కానీ.. ఈ ఏడాది కూడా ఆశించిన విధంగా కమ్యూనిస్టుల ప్రభావం కనిపించలేదు. అయితే.. ప్రజలకు సమస్యలు లేవేమో.. అందుకే రాలేదేమో.. అనే ప్రశ్న తెరమీదికి వస్తుంది.
కానీ.. నెల్లూరు జిల్లా కరేడు, ఉమ్మడి పశ్చిమలో మత్స్యకారగ్రామాలు భూములు, సముద్రపునీరు.. సమస్య లతో అల్లాడాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇక, సర్‌పై పెద్ద ఎత్తున ఉద్యమమే కాం గ్రెస్ పార్టీ చేపట్టింది. కానీ.. ఈ ఉద్యమాల జోలికి సీపీఎం నాయకులు పోకపోవడం గమనార్హం. అయితే.. విద్యుత్ చార్జీలు.. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వంటివాటిపై మాత్రం మీడియా ముందు కొంత మేర కు గళం విప్పారు. కానీ.. ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.
ఇక, సీపీఐ విషయానికి వస్తే.. అంతర్గత కుమ్ములాటలు కమ్యూనిస్టులను దెబ్బతీశాయి. ప్రస్తుత పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఎంపిక వివాదం అయింది. దీంతో అంతర్గతంగా పార్టీ రెండుగా చీలిపోయింది. ఇక, కీలక నాయకులుగా ఉన్న రామకృష్ణ కేంద్ర శాఖకు వెళ్లిపోయారు. అదేవిధంగా చికెన్ నారాయణగా పేరొం దిన నారాయణ కూడా.. రిటైరయ్యారు. దీంతో సీపీఐ కూడా ఉద్యమాల బాట నుంచి ఈ ఏడాది తప్పుకొన్నట్టే అయింది. మరోవైపు బలమైన మిత్రపక్షం కోసం ఎదురు చూస్తున్నా.. అది సాధ్యం కాకపోవడం గమనార్హం.
