పార్టీలు వేరైనా వీరంతా పొలిటికల్ ఫ్రెండ్స్.. !
కానీ.. ఇది మరిచిపోతున్న నాయకులు.. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో కలివిడిగా ఉంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది
By: Garuda Media | 5 Aug 2025 12:00 AM ISTకూటమి పార్టీల్లోని నాయకుల మధ్య సఖ్యత ఎలా ఉన్నా.. వైసీపీ సహా.. కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాత్రం కూటమిలోని బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు స్నేహస్వభావంతో ముందుకు సాగుతున్నారు. చిత్రం గా ఉన్నప్పటికీ.. ఇది నిజమేనన్నది క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్న మాట. వాస్తవానికి కూటమి పార్టీ ల్లో సఖ్యత కోసం.. పవన్ కల్యాణ్ సహా.. చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇది మరిచిపోతున్న నాయకులు.. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో కలివిడిగా ఉంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నిజానికి గతేడాది కాలంగా కూడా.. ఇలానే జరుగుతోందని అంతర్గత చర్చలు వున్నాయి. అయితే.. ఎవరూ బయట పడడం లేదు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, వ్యవహారాలు.. ఇలా నాలుగు రూపాల్లో పొరుగు పార్టీల నేతలతో చేతులు కలుపుతున్నారు. కాదని, వద్దని చెబుతున్నా.. ఎవరూ వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన.. ఓ ఎంపీ.. స్థానికంగా మంచి మంచి వ్యాపారాలు ఉన్నాయి. అయితే.. ఆయన నేరుగా వ్యాపారాలు చేయరు. సబ్ కాంట్రాక్టులు, లీజులు ఇస్తారు. వీటిని సొంత పార్టీ నాయకుల కు కాకుండా.. వైసీపీ నేతలకు ఇచ్చారన్నది టీడీపీ నాయకులు చెబుతున్న మాట.
ఇక, ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన ఓ ఎమ్మెల్యే.. నేరుగా కాంగ్రెస్ నాయకులతోనే చెట్టాపట్టాలు వేసు కుని తిరుగుతున్నారు. పైగా.. ఆయనతో పొగించుకోవడం.. తాను కూడా పొగడడం కామన్‌గా మారింది. వీరి మధ్య కూడా.. రొయ్యలు, చేపల చెరువుల వ్యాపాలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ అంతేగా ఉందని అంటున్నారు. మాజీ ఎంపీ చేసే వ్యాపారాల్లో టీడీపీ నాయకులే పెట్టుబడులు పెట్టారన్నది స్థానికంగా విని పిస్తున్న మాట. వైసీపీకి చెందిన మాజీ ఎంపీపై.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు ఆ ఆరోపణలను కూడా పక్కన పెట్టి.. విచారణకు రాకుండా చేస్తున్నారన్న టాక్ కూడా వినిపి స్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇలా చేస్తే.. తప్పని.. ఒకవైపు వైసీపీపై పోరాడుతుంటే.. మరోవైపు మీరు ఆ పార్టీతోనే అంటకాగితే ఎలా ? అంటూ.. టీడీపీ అధినేత వార్నింగులు ఇస్తున్నారు. అయినా.. వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రం ఆగడం లేదు. అంతేకాదు.. గతంలోనూ తాము కలిసే వ్యాపారాలు చేశామని అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. పైగా.. తమకు సానుకూలమేనని.. అంటున్నారు. ఈ వ్యవహారం కొన్నాళ్లుగా సాగుతుండడంతో పార్టీలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి.
