ఏపీలో కూటమి బలంగానే ఉందా...?
ఏపీలో కూటమి పార్టీలు బలంగానే ఉన్నాయా? క్షేత్రస్థాయిలో నాయకులు కలివిడిగానే ఉన్నారా? - ఇది.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు ఎదురవుతున్న ప్రధాన ప్రశ్నలు.
By: Garuda Media | 10 May 2026 4:00 PM ISTఏపీలో కూటమి పార్టీలు బలంగానే ఉన్నాయా? క్షేత్రస్థాయిలో నాయకులు కలివిడిగానే ఉన్నారా? - ఇది.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు ఎదురవుతున్న ప్రధాన ప్రశ్నలు. ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పరిశీలించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండుళ్ల కాలంలో ఎదురైన అనేక సంఘటనల ప్రభావం కూడా కనిపిస్తోంది.
చాలా వరకు నియోజకవర్గాల్లో కలివిడి రాజకీయాలు కరువయ్యాయి. ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసేందుకు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిణామాలను తెలుసుకునేందుకు టిడిపి, జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15వ తారీకు నుంచి నాలుగు రోజులపాటు సర్వే చేయాలని టిడిపి నిర్ణయించింది. ముఖ్యంగా కూటమి పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నుంచి అభిప్రాయాలను తీసుకుంటారు.
ఎక్కడికక్కడ పార్టీలో సమన్వయం, నాయకుల మధ్య వివాదరహిత రాజకీయాలు, కూటమిని బలోపేతం చేసే అంశాలపై నాయకులు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న నాయకులు కీలక పాత్ర వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని కూడా చెప్పారు. ఐక్యంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిణామాలు గమనిస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు నాయకులను ఏకతాటిపై నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు నాయకులకు దిసానిర్దేశం చేశారు. కొంతమందిని హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదన్నది స్పష్టమవుతుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా నాయకులు కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని కూడా టిడిపి, జనసేన పార్టీలు కోరుకుంటున్నాయి. వైసిపి అధినేత జగన్ పుంజుకోకముందే కూటమి పార్టీలు బలవపేతం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం ఏర్పాటు చేసేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలను ఏర్పాటు చేయడానికి ముందు అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది నాయకుల అసంతృప్తికి కారణాలు ఏమిటి అనే అంశాలను తెలుసుకునేందుకు ఈ నెల 15 నుంచి సర్వే చేయించనున్నారు.
మరోవైపు నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం కూడా చేస్తారు. మొత్తంగా కమిటీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే అంశాలను పక్కనపెడితే అసలు క్షేత్రస్థాయి పరిస్థితులను మరింత లోతుగా తెలుసుకునేందుకు నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా కూడా ఈ సర్వే ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే `మై టిడిపి` యాప్ ద్వారా నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
జనసేన కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు చక్కబడడం లేదు. వేరే ప్రాంతాలకు చెందిన వారిని తమకు ఇన్చార్జిలుగా నియమించారని ఇది సమంజసం కాదని క్షేత్రస్థాయి నాయకులు చెప్తున్నారు. తద్వారా అధికార ఆధిపత్యం పెరుగుతున్నాయని కూడా వాదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చేపట్టనున్న సర్వేలు మార్పు తీసుకొచ్చే విధంగా అదేవిధంగా నాయకుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా కీలకపాత్ర పోషించనున్నాయని టిడిపి నేతలు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
